Oct 28,2023 21:16

మీడియాతో మాట్లాడుతున్న ఎస్‌పి ఎం.దీపిక

ప్రజాశక్తి-విజయనగరం : ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరిగే విజయనగరం ఉత్సవాలు, పైడితల్లమ్మ తొలేళ్లు, సిరిమానోత్సవానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎస్‌పి దీపిక తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సిరిమానోత్సవాన్ని శాంతి యుతంగా నిర్వహించేందుకు బందోబస్తును సెక్టార్లుగా విభజించామన్నారు. 2015 మంది పోలీసులు మూడు షిఫ్టులుగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. బందోబస్తులో ఇద్దరు అదనపు ఎస్‌పిలు, 12 మంది డిఎస్‌పిలు, 58 మంది సిఐలు/ఆర్‌ఐలు, 144 మంది ఎస్‌ఐలు/ఆర్‌ఎస్‌ఐలు, 19 మంది మహిళా ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, స్పెషల్‌ పార్టీ సిబ్బందితో సహా 2015 మంది ఉంటారని వివరించారు. మొత్తం బందోబస్తును, కమాండ్‌ కంట్రోల్‌ పర్యవేక్షించేందుకు పోలీసు అధికారులను నియమించామన్నారు. ఈ బందోబస్తు విధుల్లో ఎన్‌సిసి సిబ్బంది సేవలను కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆలయం ఎదురుగా తాత్కాలికంగా కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకొని వచ్చే మార్గంలో, ఇతర ముఖ్య కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సిరిమాను తిరిగే మార్గంలో ముందుగా గుర్తించిన 11 ప్రాంతాల్లో రూఫ్‌ టాప్‌లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతాలకు దగ్గరలో శిథిలావస్థలో ఉన్న 11 భవనాలను గుర్తించి, ఆయా భవనాల మీదకు ఎవరినీ అనుమతించవద్దని యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. వాహనాల పార్కింగుకు ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌పి వెల్లడించారు. సమావేశంలో ఎఎస్‌పి అస్మా ఫర్హీన్‌, డిఎస్‌పిలు ఆర్‌.గోవిందరావు, డి.విశ్వనాథ్‌, సిఐలు నర్సింహమూర్తి, వెంకటరావు, జె.మురళి పాల్గొన్నారు.