ప్రజాశక్తి-గుంటూరు : కౌన్సెలింగ్ బదిలీలను అపహస్యం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన సిఫార్సు బదిలీలను ఆపాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్ డిమాండ్ చేశారు. సిఫార్సు బదిలీలు ఆపాలని, కౌన్సెలింగ్ ద్వారా బదిలీ అయిన టీచర్లకు వెంటనే జీతాలు విడుదల చేయాలని తదితర సమస్యలపై డిఇఒ కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపి డిఇఒకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్.కుసుమ కుమారి మాట్లాడుతూ బదిలీల కౌన్సెలింగ్ జరిగి 10 రోజులు కూడా కాకుండానే పోస్టులు దాచిమరీ అక్రమ బదిలీలు జరపటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ రాత్రి పగలు ఇళ్ల వెంటే తిరుగుతూ ఉపాధ్యాయులను చిన్నచిన్న కారణాణాలకే సస్పెండ్ చేస్తున్న ప్రవీణ్ ప్రకాష్ సిఫార్సు బదిలీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీతాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సిహెచ్.ఆదినారాయణ, ఎమ్‌డి షకీలాబేగం, జి.వెంకటేశ్వరరావు, కె.రంగారావు, కె.ప్రభూజీ, కె.ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.










