Sep 22,2023 22:31

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు పట్టుబడుతున్నా వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు పాత పెన్షన్‌ విధానం తప్ప మరే ఇతర కొత్త మార్పులనూ తాము ఒప్పుకోమని స్పష్టం చేస్తున్నారు. తూర్పు గోదావరి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో సుమారు 18 వేల మంది సిపిఎస్‌ ఉద్యోగులున్నారు. సచివాలయం, ఆర్‌టిసి ఉద్యోగులను కూడా కలుపుకుంటే మొత్తంగా 30 వేల మంది ఉద్యోగులు సిపిఎస్‌ పరిధిలోకి వస్తారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో సిపిఎస్‌ స్థానంలో గ్యారంటీ పెన్షన్‌ స్కీము (జిపిఎస్‌)ను అమలు చేస్తామని చెప్పింది. దీంతో సిపిఎస్‌ పరిధిలోని ఉద్యోగులంతా క్యాబినెట్‌ నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. సిపిఎస్‌ విధానంలో 10 శాతం ఉద్యోగి వాటా మరో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి షేర్‌ మార్కెట్‌లో పెట్టగా వచ్చే లాభాన్ని పెన్షన్‌గా అందజేస్తారు. అయితే జిపిఎస్‌ విధానంలో మరీ దారుణం. కేవలం ఉద్యోగి వాటా మాత్రమే షేర్‌ మార్కెట్లో జమ చేస్తారు. ఉద్యోగి కట్టే దానిలో 50 శాతం మాత్రమే జిపిఎస్‌ విధానంలో పెన్షన్‌గా అందజేస్తామని చెప్పడంతో ఈ విధానాన్ని ఉద్యోగులంతా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. పాత పెన్షన్‌ స్కీమునే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
నష్టాలే ఎక్కువ
ఉద్యోగ విరమణ తర్వాత పాత పెన్షన్‌ ఉద్యోగికి నూరు శాతం లబ్ధి చేకూరితే, సిపిఎస్‌ ఉద్యోగికి పాతిక శాతం మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా నష్టాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత పిఆర్‌సిలు వర్తించవు. ఉద్యోగి ప్రతినెలా బేసిక్‌ పేతో సహా డిఎపై 10 శాతం సొమ్ము చెల్లించాలి. పిఎఫ్‌ ఆర్‌డిఎకు ఉద్యోగి ప్రతి సంవత్సరం నిర్వహణ ఛార్జీలు చెల్లించాలి. ఉద్యోగ విరమణ తర్వాత హెల్త్‌ కార్డులు వర్తించవు. షేర్‌ మార్కెట్‌ ఆధారిత పెన్షన్‌ ఇస్తారు. అది కూడా 70 సంవత్సరాల వరకే ఉంటుంది. ఉద్యోగ విరమణ అనంతరం తీసుకునే 60 శాతం సొమ్ముకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 40 శాతంతో ఆన్యూటీ ప్లాన్‌లు కొనాల్సి ఉంటుంది. పెన్షన్‌కు ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి దిక్కు ఉండదు. ఫ్యామిలీ పెన్షన్‌ వర్తించదు. ఉద్యోగం చేస్తూ మరణించిన సిపిఎస్‌ ఉద్యోగి కుటుంబానికి మాత్రమే ఫ్యామిలీ పెన్షన్‌ వర్తిస్తుంది. అప్పటివరకు సిపిఎస్‌ ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాలి. రిటైర్మెంట్‌ తర్వాత కూడా ప్రభుత్వ పథకాలు వర్తించవు.
పాత పెన్షన్‌ వల్ల
పాత పెన్షన్‌ వల్ల సంవత్సరానికి రెండు డిఎలు, ఐదేళ్లకు ఒకసారి పిఆర్సిఇతో పెన్షన్‌ పెంపు సౌలభ్యం ఉంటుంది. ఉద్యోగ విరమణ తరువాత కూడా హెల్త్‌ కార్డులు పని చేస్తాయి. ఉద్యోగులు పెన్షన్‌ నిర్వహణ ఛార్జీలు చెల్లించనక్కరలేదు. పెన్షన్‌ కోసం ఉద్యోగి ప్రతినెలా చందా చెల్లించనవసరం లేదు. ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగి మరణించినా వారి కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. జీవితాంతం పెన్షన్‌ సౌకర్యం ఉంటుంది. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్‌ కోసం ఉద్యోగి ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదు.

ఒపిఎస్‌ కోసం పోరాటంమిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగా పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అంతా దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తాం. ప్రభుత్వం ఎన్ని అణచవేత చర్యలకు దిగినా వెనక్కి తగ్గేది లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీను మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం. నాలుగేళ్లు గడచినా సిపిఎస్‌ విధానం రద్దు అంశంపై కనీసం నోరు మెదపడం మానేసి ఇప్పుడు జిపిఎస్‌ అమలు చేస్తామని చెప్పడం విడ్డురంగా ఉంది.
- మొండి రవికుమార్‌,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎపిసిపిఎస్‌యు.