May 05,2023 00:25

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు చిన్నబ్బాయి

ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రతిపక్ష నేతగా ఎన్నికలు, పాదయాత్ర సమయాల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సిపిఎస్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు భద్రతనిచ్చే పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం జరిగిన యుటిఎఫ్‌ జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే సిపిఎస్‌ను రద్దు చేసి, ఒపిఎస్‌ను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నారని, జగన్‌ కూడా వెంటనే సిపిఎస్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి పెన్షన్‌ పథకం వర్తిస్తున్నప్పుడు, ఉద్యోగులకు పెన్షన్‌ లేకపోవడం అన్యాయమన్నారు. పిఎఫ్‌ ఆర్‌డిఎ బిల్‌ పార్లమెంటులో పాస్‌ కాకముందే 2003 డిఎస్‌సి ఉపాధ్యాయుల నోటిఫికేషన్‌ విడుదల అయినందున, వారిని పాత పెన్షన్‌ పథకం కిందకు తీసుకురావాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు డిఎ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. పాత పిఆర్‌సి కాలవ్యవధి జులై నెలతో ముగియనున్నందున, 12వ పిఆర్‌సి కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ గౌరవాధ్యక్షులు నెల్లి సుబ్బారావు, అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి, కోశాధికారి జోగా రాజేష్‌, జిల్లా కార్యదర్శులు వి.రమేష్‌ రావు, వి.చైతన్యషీలా, శేషుకుమార్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎల్లయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.