May 14,2023 17:13

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్

సిపిఎస్ రద్దుపై ప్రభుత్వ వైఖరేంటో తేల్చాల్సిందే
మిగతా రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలి - యుటిఎఫ్
ప్రజాశక్తి - నంద్యాల

        కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, ఇప్పటికైనా సిపిఎస్ రద్దు పట్ల ప్రభుత్వం తమ వైఖరిని తేల్చాల్సిందేనని లేని పక్షంలో ఆగస్ట్ 12న యు టి ఎఫ్ అధ్వర్యంలో తాలూకా ,జిల్లా స్థాయిలో 24 గంటల నిరాహారదీక్ష కార్యక్రమం  చేపట్టనున్నట్లు యు టి ఎఫ్ రాష్ట కార్యదర్శి ఎన్.నాగమణి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పి వి.ప్రసాద్, జె.సుధాకర్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్.జాకీర్ హుస్సేన్ జిల్లా సహా అద్యక్షులు ఎం.సత్య ప్రకాష్ లు డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయం లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పి వి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు  పి వి ప్రసాద్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే వారంలోపే సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న అధికార పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఉలుకు పలుకూ లేకుండా ఉందన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని ప్రకటించుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు విషయంలో మాట తప్పి, మడమ తిప్పి హామీ అమలు నుండి పారిపోయాడని ఎద్దేవా చేశారు. సిపిఎస్ రద్దుపై హామీలు ఇవ్వని అనేక రాష్ట్రాలు సిపిఎస్ ను రద్దు చేస్తుంటే హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. యుటిఎఫ్  రాష్ట కార్యదర్శి ఎన్. నాగమణి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు పై హామీలు ఇచ్చి, అమలు చేస్తున్న  అనేక పార్టీలు ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి వస్తున్న విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ విషయంపై మిగతా రాజకీయ పార్టీలు సైతం తమ వైఖరిని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన పార్టీ లు ఎన్నికల్లో గెలిచి అధికారం లోకి వస్తున్నాయని సీపీఎస్ రద్దు చేయని పార్టీని ఓడిపోతున్నయని  రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాల్సిందే అని లేకపోతే ఉద్యోగ,ఉపాద్యాయులు తమ శక్తి ఏమిటో ఈ ప్రభుత్వానికి చూపిస్తారని తెలియచేశారు. యుటిఎఫ్ గౌరవ అధ్యక్షులు ఎస్. జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ  2004లో సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు వామపక్షాలు తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ అనుకూలంగా ఓటు వేశాయని వారు గుర్తు చేశారు. 2004 నుంచి సిపిఎస్ కు వ్యతిరేకంగా పాత పెన్షన్ విధానం కావాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాలు, ఉద్యమాలు సాగిస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని  హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక దాని ఊసెత్తకపోవడం, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో  ఉన్నప్పుడు మరోలా కాకుండా రాజకీయ పార్టీలు సిపిఎస్ రద్దుపై నిర్దిష్టంగా అభిప్రాయాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సిపిఎస్ రద్దు కోసం పోరాటాలు ఉధృతమైన నేపథ్యంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు కొన్ని రాష్ట్రాలు ప్రకటించి, ఉత్తర్వులను విడుదల చేశాయని వారు పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానంలోకి వెళ్తే ఎన్ఎస్ఇఎల్ లోని సొమ్ము తిరిగి రాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. యు టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. సుధాకర్ మాట్లాడుతూ  2013 లో పార్లమంటులో చట్టం అయిన పిఎఫ్ఆర్డిఎ ను రద్దు చేయాలని  చేశారు. పెన్షన్ ఇవ్వడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం అవుతుందనే గ్లోబెల్  ప్రచారంపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.కొత్త పెన్షన్ విధానాలు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి నష్టమని, కార్పొరేట్లకు మాత్రమే లాభమని గణాంకాలు చెప్తున్నా సిపిఎస్ ను ఎందుకు అమలు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ తదుపరి సదుపాయాలు షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేయడం దుర్మార్గమైన చర్య అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు కోసం చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధాలు విధించడం, అక్రమ కేసులు పెట్టడం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వానికున్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. సిపిఎస్ రద్దయ్యే వరకు , పాత పెన్షన్ విధానం అమలయ్యే వరకు  తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, మరియు రాజకీయ పార్టీలన్నీ సిపిఎస్ రద్దుపై తక్షణమే తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. యు టి ఎఫ్ జిల్లా సహా అద్యక్షులు ఎం.సత్య ప్రకాష్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోసం యు టి ఎఫ్ అధ్వర్యంలో ఆగస్ట్ 12న 24 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నామని అప్పటికి ప్రభుత్వం స్పందిచకపోతే సెప్టెంబర్ 1 ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియచేశారు. సమావేశంలో యుటిఎఫ్ జిల్లా ఆర్థిక కార్య దర్శి ఎస్.బాబా ఫకృద్దిన్,  జిల్లా కార్య దర్శులు ఎస్.షమీమ్ బాను సంధ్య జ్యోతి, వి వి రామ్ మోహన్,పిసిహెచ్ బాలస్వామి,కె రామ కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు.