* సిపిఎస్‌ను రద్దు చేస్తారా? గద్దె దిగుతారా?
* కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎపి సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్షులు గురుగుబెల్లి భాస్కరరావు అన్నారు. ఇదే డిమాండ్‌పై ఎపి సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ సమీపాన జ్యోతిరావు పూలే పార్కు వద్ద ధర్మ పోరాట నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. సెప్టెంబరు ఒకటో తేదీన సిపిఎస్ ఉద్యోగులకు చీకటి రోజన్నారు. సిపిఎస్, జిపిఎస్‌ను వ్యతిరేకిస్తూ పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయుల డబ్బును పెట్టుబడిదారులకు అందుబాటులోకి తేవడానికి ప్రపంచబ్యాంకు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ విధానాన్ని అమలు చేసే బాధ్యతలను రాష్ట్రాలకు బదలాయించినట్లు తెలిపారు. ఉద్యోగుల భవిష్యత్‌ను షేర్ మార్కెట్లో కార్పొరేట్ సంస్థల్లో తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఈ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం గ్రాట్యుటీ ఫ్యామిలీ పింఛన్‌ను తీసుకొచ్చిందన్నారు. పాదయాత్రలో పాత పింఛన్‌ను అమలు చేస్తానని సిఎం జగన్ హామీనిచ్చారని గుర్తుచేశారు.
కమిటీలతో కాలయాపన
కమిటీలతో కాలయాపన చేయనని చెప్పిన ముఖ్యమంత్రి టక్కర్ కమిటీ నివేదిక అధ్యయనానికి మంత్రుల కమిటీ, అధికారులతో ఒక కమిటీ నియమించి తన నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసుకున్నారన్నారు. రాజ్యాంగ పరమైన, న్యాయపరమైన హక్కులు పోరాటాల ద్వారానే సాధించుకోవాలనే దఢ సంకల్పంతో సిపియస్ ఉద్యోగుల ఏకతాటిపైకి వచ్చి ఒకే వేదిక ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో తమ నిరసనను ప్రభుత్వానికి తెలిస్తున్నామన్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే ఎన్నికల్లో సత్తాను చూపి గద్దె దించుతామని హెచ్చరించారు. ఈ శిబిరంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు కిలారు నారాయణ రావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పొందూరు అప్పారావు, ఎస్. కిశోర్ కుమార్, బొణిగి భాస్కరరావు, జయమ్మ, అంపోలు షణ్ముఖరావు, కొత్తపల్లి ప్రకాష్, బొణిగి శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.










