ప్రజాశక్తి -యంత్రాంగం
భీమునిపట్నం : సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి రెవెన్యూ ఉద్యోగులు గురువారం స్థానిక ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా పట్టించుకోలేదని ఉద్యోగులు విమర్శించారు. చట్ట బద్ధంగా రావల్సినవి, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. హామీలు ఇచ్చి, మర్చిపోయిన అంశాలను గుర్తు చేసేందుకే తమ ఉద్యమం అని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సిపిఎస్‌ను రద్దు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 9 నుంచి ప్రారంభమైన ఉద్యమం ఏప్రిల్ 3వ తేదీ వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీకుమారి, విఆర్‌ఎ కె సుధీర్, కార్యాలయ సబార్డినేటర్లు నారాయణప్పడు, వెంకటరావు, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పద్మనాభం : పద్మనాభం మండల కాంప్లెక్స్‌లో ఉన్న తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం భీమిలి నియోజకవర్గ కార్యదర్శి కోటేశ్వరరావు పాల్గొన్నారు.