ఉపాధ్యాయులకు సంఘీభావంగా స్టీల్ సిఐటియు ధర్నా
ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉద్యోగ, ఉపాధ్యాయులకు సిఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దుచేసి, ఒపిఎస్ అమలు చేయాలని స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.అయోధ్యరామ్, వైటి.దాస్ డిమాండ్ చేశారు. గురువారం స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు అధ్యక్షులు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో సిఎం జగన్‌ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఉద్యమిస్తున్న ఉపాధ్యాయుల పోలీసుల దమనకాండ దారుణమన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై ప్రభుత్వం, పోలీసుల నిర్బంధాన్ని ఖండించారు. సిఐటియు నగర ఉపాధ్యక్షులు ఎన్ రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధాన్ని వ్యతిరేకించారు. జగన్ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రానికి రాసిన లేఖపై కూడా అనుమానాలు వస్తున్నాయన్నారు. స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి వైటి దాస్ మాట్లాడుతూ విపక్ష నేతగా పాదయాత్రలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్ వల్ల కలిగే అన్యాయాన్ని ప్రశ్నించిన సిఎం జగన్, అధికారంలోకి వచ్చాక మాటమార్చడం దుర్మార్గమని, తక్షణమే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు యు.రామస్వామి, నీలకంఠం, శశిరెడ్డి, విడివి పూర్ణచంద్రరావు, గంగాధర్, ఒప్పంద కార్మిక ప్రతినిధులు పి శ్రీనివాసరాజు, వివి రమణ, విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.










