Apr 22,2022 05:55
  • వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సి.పి.ఎస్‌. రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారులు 'సాంకేతిక విషయాలు' తెలియక హామీ ఇచ్చామని చెబుతున్నారు. ప్రభుత్వం సి.పి.ఎస్‌ రద్దు చేయకుండా, సి.పి.ఎస్‌ లో మార్పులు చేసి, సి.పి.ఎస్‌ ఉద్యోగికి కనీస పెన్షన్‌ వచ్చే విధంగా స్కీమ్‌ రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇది సి.పి.ఎస్‌ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సమ్మతి కాదు. సి.పి.ఎస్‌ రద్దు చేయాల్సిందేనని వారు కోరుతున్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టదాయకంగా ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సి.పి.ఎస్‌) రద్దు చేయాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర లోను ఎన్నికల ప్రణాళిక లోను ఇచ్చిన సి.పి.యస్‌ రద్దు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. యు.టి.ఎఫ్‌, ఇతర ఉపాధ్యాయ సంఘాలు స్వతంత్రంగాను, ఉమ్మడిగాను గత ఐదేళ్లగా అనేక ఉద్యమాలు చేశాయి, చేస్తున్నాయి. సి.పి.ఎస్‌ సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. సి.పి.ఎస్‌ రద్దు కోసం తిరుపతిలో యు.టి.ఎఫ్‌ ఆధ్వర్యాన పోరు గర్జన నినాదంతో ర్యాలీ, 4 వేల మంది ఉపాధ్యాయులతో సభ జరిగాయి. పి.డి.ఎఫ్‌ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గత బడ్జెట్‌ సమావేశాలలో పి.డి.ఎఫ్‌తో పాటు ఇతర ఎమ్మెల్సీలు కూడా వాయిదా తీర్మానం ఇచ్చి, చైర్మన్‌ పోడియం వద్ద 3 గంటలపాటు సి.పి.ఎస్‌ రద్దు చేయాలని ఆందోళన చేశారు. యు.టి.ఎఫ్‌ సారథ్యంలో ఏప్రియల్‌ 18న రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల నుండి పోరుగర్జన పేరుతో బైక్‌ ర్యాలీ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 25న విజయవాడలో వేలాది మందితో సి.పి.ఎస్‌ రద్దు డిమాండ్‌తో బైక్‌ ర్యాలీ జరగబోతున్నది.

  • పాత పెన్షన్‌ విధానం

2004 సంవత్సరానికి ముందు నియమితులైన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇప్పుడు అమలులో ఉన్న పాత పెన్షన్‌ విధానాన్ని (ఒ.పి.ఎస్‌) ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్నాము. మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన ఉద్యోగులకు ఒక సామాజిక భద్రత ఉండాలని రాజ్యాంగం చెప్పింది. పెన్షన్‌ కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. వీటితో పాటు సుప్రీం కోర్టు ధర్మాసనం 1982లో డి.ఎస్‌. నకరా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ''పెన్షన్‌ భిక్ష కాదు. ఉద్యోగుల హక్కు'' అని స్పష్టంగా చెప్పింది. దశాబ్దాల పోరాట ఫలితం, సుప్రీం కోర్టు తీర్పు ఫలితంగా 'ట్రిపుల్‌ బెనిఫిట్‌ పెన్షన్‌' పథకాన్ని ఉద్యోగులు 1980వ దశకంలో సాధించుకున్నారు. ఉద్యోగులకు వున్న అన్ని సామాజిక భద్రతా పథకాల కంటే పాత పెన్షన్‌ విధానం ఎంతో మెరుగైనది. దీనిలో పెన్షన్‌ పొందటానికి ఉద్యోగులు ఎటువంటి కంట్రిబ్యూషన్‌ చెల్లించనవసరం లేదు. ప్రభుత్వ వాటా సొమ్ము చెల్లించనవసరం లేదు. ఉద్యోగులు భవిష్య నిధి (ఫి.ఎఫ్‌) ఖాతాకు మాత్రం నెల నెల చెల్లిస్తారు. ఉద్యోగుల సొమ్ముపై ప్రతి ఏటా వడ్డీ చెల్లిస్తుంది. పాత పెన్షన్‌ విధానంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించటానికి సామాజిక భద్రత ఏర్పడింది.

  • సి.పి.ఎస్‌. రద్దు చేయాల్సిందే...
  • ప్రైవేటీకరణలో భాగమే సి.పి.ఎస్‌ విధానం

1990వ దశకంలో ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమై, మన దేశంలో కూడా ఎల్‌.పి.జి - సరళీకరణ - ప్రైవేటీకరణ - ప్రపంచీకరణ విధానాలు అమలు చేశారు. దీనిలో భాగంగా భారతదేశంలో పెన్షన్‌ సంస్కరణలను అమలు చేయాలని ప్రపంచబ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. 2001లో పెన్షన్‌ సంస్కరణల కోసం వాజ్‌పేయి ప్రభుత్వం బి.కె. భట్టాచార్య కమిషన్‌ నియమించింది. ఆ కమిటీ 2003 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి నూతన పెన్షన్‌ విధానంపై నివేదిక ఇచ్చింది. 2003 డిసెంబర్‌ 22న ప్రభుత్వం పార్లమెంట్‌లో విధాన ప్రకటన చేసి, 2004 జనవరి 1 నుండి నూతన పెన్షన్‌ స్కీం పేరుతో కొత్త పెన్షన్‌ విధానం అమలు లోకి తెచ్చింది. నూతన పెన్షన్‌ విధానం అమలులో భాగంగా పిఎఫ్‌ఆర్‌డిఎ చట్టం చేయడంలో బిజెపి, కాంగ్రెస్‌ రెండూ కలసి ఆమోదించాయి. 2013లో పిఎఫ్‌ఆర్‌డిఎ చట్టం ఆమోదం పొంది, అమలు లోకి వచ్చింది. పాత పెన్షన్‌ స్థానంలో 2004 జనవరి 1 నుండి కొత్త పెన్షన్‌ విధానం అమలులోకి వచ్చింది.

 

  • ఆంధ్రప్రదేశ్‌ లో సిపిఎస్‌

2004 జనవరి 1 నుండి జాతీయ స్థాయిలో అమలులోకి వచ్చిన నూతన పెన్షన్‌ విధానం 2004 సెప్టెంబర్‌ 1 నుండి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం పేరుతో అమలు లోకి వచ్చింది. ఇప్పుడు సి.పి.ఎస్‌ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,90,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పర్మినెంట్‌ అయిన తరువాత సి.పి.ఎస్‌ పరిధిలో ఉండే ఉద్యోగుల సంఖ్య 3 లక్షలు దాటుతుంది.
సి.పి.ఎస్‌ అమలు లోకి వచ్చిన తరువాత దేశంలోను, రాష్ట్రంలోను అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. సి.పి.ఎస్‌ ఉద్యోగుల సంఖ్య పెరిగేకొద్దీ ఆందోళనలు ఉధృతమైనాయి. ప్రమాదశావత్తు లేక ఆరోగ్య కారణాల వలన మరణించిన సి.పి.ఎస్‌ ఉద్యోగులు నెలకు 1500 లేక 2000 రూపాయలు పెన్షన్‌ పొందటం ఆందోళన కలిగించింది. 2018 జులైలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగిన సి.పి.యస్‌. జాతాలు ఉద్యమ స్ఫూర్తిని కలిగించాయి.
ఫలితంగా 2018లో ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వం పెన్షన్‌ విధానం సమీక్షించటానికి ఎస్‌.పి. టక్కర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ ఆప్షన్‌-ఎ గా పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, ఆప్షన్‌-బి గా ప్రభుత్వ వాటా పెంపు, కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు ద్వారా సి.పి.ఎస్‌ విధానాన్ని మెరుగుపరచాలని ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆప్షన్‌-బి కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయత్నించగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తిరస్కరించారు.
వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సి.పి.ఎస్‌. రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారులు 'సాంకేతిక విషయాలు' తెలియక హామీ ఇచ్చామని చెబుతున్నారు. ప్రభుత్వం సి.పి.ఎస్‌ రద్దు చేయకుండా, సి.పి.ఎస్‌ లో మార్పులు చేసి, సి.పి.ఎస్‌ ఉద్యోగికి కనీస పెన్షన్‌ వచ్చే విధంగా స్కీమ్‌ రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇది. సి.పి.యస్‌. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సమ్మతి కాదు. సి.పి.ఎస్‌ రద్దు చేయాల్సిందేనని వారు కోరుతున్నారు. వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2022 మార్చి 31 లోగా రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు సంఘాలతో చర్చలు జరపలేదు. పి.ఆర్‌.సి. ఉద్యమ డిమాండ్లలో సి.పి.ఎస్‌ ఉన్నప్పటికి ప్రభుత్వం దాని గురించి చర్చలు జరపలేదు.

  • వివిధ రాష్ట్రాలు - రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌

2004 జనవరి 1 నుండి అమలు లోకి వచ్చిన నూతన పెన్షన్‌ విధానాన్ని ఆనాడు బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో అమలు జరపలేదు. 2013లో కేరళలో యు.డి.ఎఫ్‌ ప్రభుత్వం, 2018లో త్రిపురలో బి.జె.పి ప్రభుత్వం సి.పి.ఎస్‌ అమలు లోకి తెచ్చాయి. బెంగాల్‌లో ఇప్పటికీ పాత పెన్షన్‌ విధానం కొనసాగుతున్నది. పార్లమెంటులో వామపక్షాలు సుదీర్ఘకాలం పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఎ బిల్లు చట్టం కాకుండా అడ్డుకున్నాయి. 2013లో బి.జె.పి, కాంగ్రెస్‌ కలసి ఆమోదింపజేసుకున్నాయి.
ఇప్పుడు ఉద్యమాలు, పోరాటాల ఉధృతి పెరిగిన తరువాత అనేక రాష్ట్రాలు సి.పి.ఎస్‌ గురించి పునరాలోచన చేస్తున్నాయి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా 2022 ఏప్రిల్‌ 1 నుండి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి కూడా సి.పి.ఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామని, పిఎఫ్‌ ఖాతాలు పునరుద్ధరిస్తామని ప్రకటించారు. సిపిఎస్‌ రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ శాసనసభ కూడా తీర్మానం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసి నిపుణుల కమిటీని నియమించారు. కేరళ ప్రభుత్వం కూడా సిపిఎస్‌పై కమిటీని నియమించింది. జాతీయ స్థాయిలో సిపిఎస్‌పై కాంగ్రెస్‌ పార్టీ పునరాలోచన చేస్తున్నదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రతినిధి కొప్పుల రాజు ఇటీవల ప్రకటించారు.

  • ముఖ్యమంత్రి రాజకీయ నిర్ణయం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కమిటీలు, అధికారుల సలహాలతో కాలయాపన చేయకుండా... ముఖ్యమంత్రి రాజకీయ నిర్ణయం చేసి సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలి. భారతదేశం సమాఖ్య రాజ్యం. రాజ్యాంగం లోని 1వ నిబంధన దేశాన్ని ''యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌'' అని పేర్కొన్నది. రాజ్యాంగం లోని 7వ షెడ్యూల్‌లో కేంద్రంతో పాటు రాష్ట్రాలకు 66 అంశాలపై అధికారాలు ఇచ్చింది. ఉదాహరణకు ఇటీవల కేంద్రం 3 సిఫార్సులు, చట్టాలు చేసింది. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో వున్నది. ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధం. అదేవిధంగా తమ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్‌ విధానం నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. అందువలన వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ''రాజకీయ నిర్ణయం'' తీసుకుని సిపిఎస్‌ రద్దు చేయకపోతే రాబోయే సంవత్సర కాలంలో ఉద్యోగులు, పోరాటాలు ఉధృతమౌతాయి. సిపిఎస్‌ రద్దును ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల ఎజెండాలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి సిపిఎస్‌ను రద్దు చేయాలి.

సి.పి.ఎస్‌. రద్దు చేయాల్సిందే...
/ వ్యాసకర్త - శాసన మండలి సభ్యులు,
సెల్‌ : 9440262072/