Oct 28,2022 22:38

ప్రజాశక్తి - భీమడోలు
            ప్రభుత్వం సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు షేక్‌ సాబ్జీ కోరారు. పొలసానిపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 2007లో పాఠశాలలకు చెందిన కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల సేవలను క్రమబద్ధీకరించారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సైతం ఆ విధానాన్ని అమలు చేయాలని కోరారు. గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాలు పెంచాలని కోరారు. వారు చేపట్టే కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన భీమడోలు మండల వనరుల కేంద్రంలో ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణా తరగతులను పరిశీలించారు. ఒప్పంద ప్రాతిపదిక పనిచేస్తున్న ఉద్యోగులు తమ జీతాలను పెంచేందుకు కృషి చేయాలని కోరుతూ ఆయనకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి రవీంద్ర, మండల శాఖ అధ్యక్షులు జిజె.రవికాంత్‌, ప్రధాన కార్యదర్శి జి.బాలభాస్కర్‌, గౌరవాధ్యక్షులు బి.సత్యనారాయణ, పైడారావు పాల్గొన్నారు.
ఏలూరు : ఏలూరు సెంట్‌ జెవిఆర్‌ పాఠశాలలో ఏలూరు అర్బన్‌, రూరల్‌ మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత పాఠశాల స్థితిగతులును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా చూస్తామని తెలిపారు. ఎంఎల్‌సితో పాటు ఎంఇఒ ఎస్‌.నరసింహమూర్తి, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌.రవికుమార్‌, జిల్లా కోశాధికారి షేక్‌ ముస్తాఫా ఆలి, యుటిఎఫ్‌ మండల ్‌నాయకులు కిరణ్‌, సురేష్‌ పాల్గొన్నారు.
ఉంగుటూరు : ఉంగుటూరు మండలం టిఎఆర్‌ఎల్‌ నారాయణపురంలో ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని ఉభయగోదావరి జిల్లాల ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు, నాలుగు, ఐదు తరగతులను విలీనం చేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.