మాచర్ల్ల: సిపిఎస్ రద్దు చేసే వరకు తమ పోరాటం కొన సాగుతుందని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.విజయసారధి డిమాండ్ అన్నారు. గురువారం స్థానిక బాలికోన్నత పాఠశాలలో యుటిఫ్ శాఖ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరాజు అధ్యక్షతన మాచర్ల, దుర్గి, వెల్దుర్తి మండలాల యుటిఎఫ్ సభ్యుల ప్రాంతీయ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన విజయసారధి మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ రంగంలోని విద్యాలయాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేప ట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఉండే ఉపా ధ్యాయుల సంఖ్యకు విద్యార్థుల సంఖ్యను గమనంలోకి తీసుకోకుండా ఉపాధ్యాయలతో నాడు-నేడు, ఇతర బోధనేతర పనులతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యా యులను విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ భయ పెడుతూ మానసిక వత్తిడికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా అమ్మఒడి నిధులు అందని విద్యార్ధులకు వీటిని మంజూరు చేసి, సమదుస్తుల కుట్టుకూలిని విడుదల చేయాలన్నారు. పెరిగిన ధరలను గమనంలోకి తీసుకోని మధ్యాహ్న భోజన రేటు కూడా పెంచాలన్నారు. 3,4,5 తరగతులను హైస్కూల్స్‌లో విలీనం చేయడం వలన విద్యార్ధులు ప్రవేట్ స్కూల్స్‌కు వెళుతున్నారని విమర్శించారు. డిఎ, ఇతర బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు షేక్ ఆయేషాసుల్తానా, ఎ నాసర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ ఎ.శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి జెవిడి నాయక్, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు షేక్ గాలిబ్‌సాహెబ్, పి.పట్టాభిరామారావు, పి.పోతురాజు, సుబ్రమణ్యం, పోలా.మల్లికార్జునరావు, యు.వెంకటేశ్వర్లు, రామారావు, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.










