Apr 27,2022 07:00

     కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌)ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యమించిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం అనైతికమే కాదు, అప్రజాస్వామికం కూడా. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) ఆధ్వర్యాన వారం రోజులుగా నిర్వహించిన 'పోరు గర్జన' విజయవాడకు చేరుకునేలోపే సిపిఎస్‌పై ప్రభుత్వం తన వైఖరేమిటో స్పష్టం చేయకుంటే, ఏప్రిల్‌ 25న సిఎం కార్యాలయ ముట్టడికి దిగుతామని ఉపాధ్యాయ సంఘ నేతలు ముందే హెచ్చరించారు. అయినా, స్పందించని ప్రభుత్వం చలో సిఎంఓ ఆందోళనను భగం చేసేందుకు ఎక్కడ లేని ఉత్సుకతను ప్రదర్శించింది. నాలుగు వేల మంది పోలీసులను రంగంలోకి దింపింది. తాడేపల్లి, విజయవాడలోకి ప్రవేశించే రహదారులన్నిటినీ బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలతో దిగ్బంధించింది. బస్టాండ్‌, రైల్వే స్టేషన్ల వద్ద పోలీస్‌ పికెట్లను పెట్టి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసింది. ఆటోలు, బస్సులు వేటినీ వదలలేదు. టీచర్లను కౌన్సిలింగ్‌ పేరుతో పోలీసు స్టేషన్‌కు రప్పించి నోటీసులివ్వడం, యుటిఎఫ్‌ నాయకులను పలుచోట్ల గృహ నిర్బంధం గావించడం, అరెస్టులు చేయడం వంటి చర్యలకు పాల్పడింది. ఇన్ని నిర్బంధాల నడుమ పట్టు సడలని దీక్షతో 'చలో సిఎంఓ' కు తరలివచ్చిన ఉపాధ్యాయులకు జేజేలు. ఉపాధ్యాయుల డిమాండ్‌ అత్యంత సముచితమైనది. వారు గొంతెమ్మ కోర్కెలేమీ కోరలేదు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తానని ఎన్నికల ప్రచారంలోను, ఎన్నికల మ్యానిఫెస్టోలోను, ప్రజా సంకల్ప యాత్రలోను జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే వారు కోరుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా దీని అమలుకు చర్యలు తీసుకోలేదు. అవగాహన లేకపోవడం వల్ల అటువంటి హామీ ఇచ్చారని, సాంకేతికంగా సాధ్యం కాదని, ఆర్థిక పరిస్థితి కూడా బాగులేదని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు కొత్త రాగం తీశారు. ఏ విధమైన హామీ ఇవ్వని రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సిపిఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానానికి వెళ్తున్నట్లు ప్రకటించిన తరువాత ఈ వాదనలో పసలేదని తేలిపోయింది. దీంతో సిపిఎస్‌పై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి తగు సిఫారసులు చేసేందుకు కొత్తగా అయిదుగురితో కమిటీని వేయడం కాలయాపన ఎత్తుగడేనన్న ఉపాధ్యాయ సంఘ నేతల విమర్శ సహేతుకమైనదే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సిపిఎస్‌ రద్దుపై నాన్పుడు ధోరణి అనుసరించి, ఎన్నికల ముందు టక్కర్‌ కమిటీని వేసింది. ఆ కమిటీ ప్లాన్‌ 'ఎ' కింద పాత పింఛను విధానాన్ని కొనసాగింపు, ప్లాన్‌ 'బి' కింద సిపిఎస్‌ స్థానే జిపిఎస్‌ ను ప్రతిపాదించింది. ప్లాన్‌ 'ఎ'ను పక్కన పెట్టి ప్లాన్‌ 'బి'ని ప్రభుత్వం ముందుకు తెచ్చినప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఒకసారి తిరస్కరించిన ప్రతిపాదననే సోమవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చల్లో అయిదుగురు సభ్యుల కమిటీ మళ్లీ తెరపైకి తేవడం ప్రభుత్వ చిత్తశుద్ధి లేమిని తెలియజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్షా ఎనబై వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నట్లు సిపిఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని తిరిగి అమలు చేయాలి. దీర్ఘకాలం పాటు సేవలందించిన ఉద్యోగులకు రిటైరైన తరువాత సామాజిక భద్రత కల్పించడం దయతో ఇచ్చే భిక్ష కాదు, ప్రభుత్వ బాధ్యత అని సుప్రీం కోర్టు ఏనాడో స్పష్టం చేసింది. నయా ఉదారవాద విధానాల్లో భాగంగా 2004 జనవరి 1 తరువాత చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కొత్త పెన్షన్‌ విధానాన్ని వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడే బలవంతంగా రుద్దారు. ఇందుకు సంబంధించిన పిఎఫ్‌ఆర్‌డిఎ చట్టాన్ని బిజెపి, కాంగ్రెస్‌ కలసి ఆమోదించుకున్నాయి. సిపిఎస్‌కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు సాగుతుంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీనిపై కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మన్నుతిన్న పాములా మిన్నకుంటున్నది. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్‌ను రద్దు చేయాలని అడిగిన ఉపాధ్యాయులపై సర్కారు ఉక్కుపాదం మోపడం గర్హనీయం. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే అది బెడిసికొడుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సిపిఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలి.