Aug 12,2023 18:58

ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు గోపీమూర్తి
యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ప్రజాశక్తి - భీమవరం
సిపిఎస్‌, ఎన్‌ఇపిని రద్దు చేయాలని ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు బి.గోపీమూర్తి డిమాండ్‌ చేశారు. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎస్‌టిఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భీమవరంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు గోపీమూర్తి, ఎస్‌టిఎఫ్‌ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్‌ సెంటర్‌ మీదుగా అంబేద్కర్‌ చౌక్‌, యుటిఎఫ్‌ కాలనీ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని కార్పొరేట్‌ మయం చేస్తోందని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధాన చట్టం 2020ను తీసుకొచ్చిందని, ఈ చట్టం వల్ల ప్రభుత్వ విద్యారంగం కార్పొరేట్‌, ప్రయివేటుమయం అయిపోయిందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్‌.విజయరామరాజు, ఎకెవి. రామభద్రం, గౌరవాధ్యక్షులు ఎం.మార్కండేయులు, సహాధ్యక్షులు కె.రాజశేఖర్‌, సహాధ్యక్షురాలు కె.శ్రీదేవి, జిల్లా కార్యదర్శులు సాయిరామ్‌, కెఎస్‌.రామకృష్ణప్రసాద్‌, జి.రామ కృష్ణరాజు, రత్నరాజు, డి.యేసుబాబు, పి.క్రాంతికుమార్‌, బి.శివ ప్రసాద్‌, కుమార్‌ బాబ్జీ, రాష్ట్ర కౌన్సిలర్స్‌ కృష్ణమోహన్‌, డి.పద్మావతి పాల్గొన్నారు.