Nov 08,2022 22:00

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
             మండలంలో వైసిపి, టిడిపికి చెందిన పలువురు కార్యకర్తలు, చిన్న సన్నకారు రైతులు సిపిఎంలో చేరినట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు తెలిపారు. మండలంలోని జగన్నాధపురంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆధ్వర్యంలో వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతర పేద రైతుల మధ్య చిచ్చు పెట్టేందుకు అనేక మంది కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గిరిజన, గిరిజనేతర పేదల ఐక్యతతోనే ఇరుపక్షాలకు రక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పేదల భూములు కార్పొరేట్లకు అప్పగించేందుకు పాలక పార్టీలు కుట్ర చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. పేదలకు అండగా సిపిఎం నిలబడుతుందని స్పష్టం చేశారు. సిపిఎం రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎన్నో పోరాటాలు చేస్తూ రైతు పక్షాన నిలబడుతుందని, అందుకే ఆ పార్టీలో చేరినట్లు కొంతమంది రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, మండల కమిటీ సభ్యులు సిరిబత్తుల సీతారామయ్య, అప్పారావు, గుండు గంగరాజు, చిట్టిబొమ్మ కొండలరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.