ప్రజాశక్తి-విఆర్.పురం
కూనవరం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన 38 కుటుంబాలు ఆదివారం భారత కమూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సిపిఎం)లో చేరాయి. వారికి సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు సిపిఎం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సమస్యల పట్ల సిపిఎం నిరంతరం చేస్తున్న ఆందోళన, పోరాటాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరుతున్నట్టు సిపిఎంలో చేరిన కన్నాపురం గ్రామస్తులు తెలిపారు. తొలుత కన్నాపురంలో ఆ గ్రామ పెద్ద కలుముల దేవ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నో ఆశలతో జగన్మోహన్ రెడ్డి మాయమాటలు ఓటేసి పట్టం కట్టారని, కానీ నేడు ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. నాలుగు సార్లు వరదలు వచ్చి సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా ఇవ్వలేకపోయిందని, వైసిపి ప్రజాప్రతినిధులు కనీసం పరామర్శ కూడా చేయలేదని తెలిపారు. దీంతో వైసీపీపై ఉన్న భ్రమలు పూర్తిగా తొలిగిపోయాయన్నారు. వరదలు వచ్చినప్పటి నుండి సిపిఎం సాహసంతో ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ వారికి అండగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. వరద బాధితులకు భోజనం సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు అనంతరం ప్రజలు రోగాల బారిన పడిన ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించిందని చెప్పారు. ఈ విధంగా మరే ఇతర పార్టీ చేయలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు, వరద బాధితులకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కాక అర్జున్, మండల కార్యదర్శి బి.బొర్రయ్య, టి.తమ్మయ్య, పోడియం దేవ, నంద, మడెం బాబూరావు తదితరులు పాల్గొన్నారు.










