Jun 22,2023 00:07

చింతపల్లి సంతలో విరాళాలు సేకరిస్తున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి-పాడేరు:భూములు కోల్పోయిన పోలవరం బాధిత నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలువునా ముంచాయని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భోనంగి చిన్నయ్య పడాల్‌ విమర్శించారు. ఈనెల 20 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు 14 రోజులు 400 కిలోమీటర్లు పోలవరం పోరు కేక పాదయాత్ర జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రకు మద్దతుగా బుధవారం చింతపల్లి సంతలో సిపిఎం కార్యకర్తలు విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేకరించిన విరాళాలను జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరదల్లో మునిగిన గ్రామాలన్నింటికీ మొదటి దశ పునరావసంలో కల పాలని, గోదావరి వరదల నుండి రక్షించడానికి ప్రభుత్వాలు ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. గత ఏడాది వరదల్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని, తప్పులతడకగా ఉన్న కాంటూరు లెక్కలను మార్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజరు, మండల కమిటీ సభ్యులు సాగిన చిరంజీవి, కిల్లో సింహాచలం, మజ్జి రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాంగి జీవన్‌, కృష్ణ, కార్తీక్‌ పాల్గొన్నారు.