Aug 27,2023 22:20

ప్రజాశక్తి - ఏలూరు
        అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్‌ ఛార్జీల భారాలతో ప్రజలను దోచుకుతింటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీ నుండి వచ్చేనెల నాలుగో తేదీ వరకూ సిపిఎం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సమరభేరి పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. ఆదివారం ఉదయం పవర్‌పేట సిపిఎం కార్యాలయంలో ఏలూరు నగర కార్యకర్తల సమావేశం బి.సోమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం అఖిల భారత కమిటీ దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతుందన్నారు. ఈ ఆందోళనలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రజలపై భారాలు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు వి.సాయిబాబు, వి.జగన్నాథరావు, కె.రామాంజ నేయులు, ప్రసాద్‌, పి.హైమ, జి.రవికిషోర్‌, గొట్టాపు మురళీ, ఎం.ఇస్సాక్‌, ఏసుబాబు, కోటేశ్వరరావు, బొత్స సింహాచలం, లక్ష్మీకుమారి, జిల్లా నాయకులు ఆదిశేషు, శారద పాల్గొన్నారు
పెదపాడు : ప్రజలపై ప్రభుత్వాల భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీ నుండి వచ్చేనెల నాలుగో తేదీ వరకూ చేపడుతున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. స్థానిక పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనంలో మండల కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ 30, 31 తేదీల్లో కరపత్రాలతో ప్రచారం, సంతకాల సేకరణ చేపట్టి వచ్చేనెల ఒకటో తేదీన గ్రామ సచివాలయాల్లో ఆర్జీలు సమర్పిస్తామని, నాలుగో తేదీన తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో పిట్టా రహాయేలు, గుండపనేని సురేష్‌, షేక్‌ కరీముల్లా, ముసునూరి కొండలరావు, గోపాలకృష్ణ, జాన్‌ సాయి, దాసు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భారాలను నిరసిస్తూ ఈనెల 30వ తేదీ నుంచి వచ్చేనెల నాలుగో తేదీవరకూ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే సమరభేరి కార్యక్రమం పోస్టర్లను మండల కమిటీ సభ్యులు ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడారు. ఈ కార్యక్రమ ంలో మండల కమిటీ సభ్యులు రాంబాబు, జి.సూర్య కిరణ్‌, పార్టీ సభ్యులు కె.సుబ్బారావు, నాగరాజు, సునీల్‌ పాల్గొన్నారు.
సిపిఎం సమరభేరిని జయప్రదం చేయాలని పార్టీ పట్టణ కన్వీనర్‌ పసల సూర్యారావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య నిలయంలో పార్టీ సీనియర్‌ నాయకులు ఉప్పల గుప్త సత్యనారాయణ అధ్యక్షతన సిపిఎం ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చల్లారి మాణిక్యాలరావు, వంగ గోపి, షేక్‌ మాబుసుభాని, ఆరేటి రామచంద్రరావు పాల్గొన్నారు.