
ప్రజాశక్తి-మునగపాక రూరల్
అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీలు పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30 నుండి సెప్టెంబర్ 4 వరకు సిపిఎం నిర్వహిస్తున్న సమరభేరి వాల్ పోస్టర్లను మంగళవారం స్థానిక మెయిన్ రోడ్డులోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ 30 , 31 తేదీల్లో ప్రచారం, సంతకాల సేకరణ, 1న సచివాలయాల వద్ద ధర్నాలు, వినతిపత్రాలు సమర్పిస్తామని, 4న అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, విద్యుత్ భారాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీని గాలికొదిలేసి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, ఇప్పుడు నెలవారీ పెంపుదలకు రంగం సిద్ధం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆళ్ల మహేశ్వరరావు, ఎస్ బ్రహ్మాజీ, పెంటకోట సత్యనారాయణ, అల్లారపు లోవేశ్వరరావు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : సమరభేరి గోడ పత్రికలను మంగళవారం మండలంలోని తిమ్మరాజుపేట గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ ఆర్.రాము మాట్లాడుతూ నేడు దేశంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతుందని, లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం వచ్చేనాటికి రూ.450 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.1200కు పెరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతులేకుండా పెరుగుతున్నాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు 40శాతం వరకు పెరిగాయని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కర్రి అప్పారావు, బుద్ధ రంగారావు, ఎస్ రామునాయుడు, బి.రామకుమార్, ఎన్.సన్యాసిరావు ఎస్ ఆదినారాయణ పాల్గొన్నారు.
సంతకాలు సేకరణ
కె.కోటపాడు : సిపిఎం సమరభేరిలో భాగంగా మండలంలోని కె.కోటపాడు, గొండుపాలెం, కింతాడ గ్రామాలలో మంగళవారం సిపిఎం జిల్లా నాయకులు గండి నాయినబాబు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. గ్రామంలో ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరించి వారికి ప్రభుత్వ అమలు చేస్తున్న విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎర్ర దేవుడు, పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.