నివాళులర్పించిన జిల్లా నేతలు
ప్రజాశక్తి - చింతూరు
సిపిఎం సీనియర్ నాయకులు, గూడూరు మాజీ సర్పంచ్ కామ్రేడ్ సొడే సుబ్బయ్య మండలంలోని గూడూరు గ్రామంలో సోమవారం మృతి చెందారు. ఆయన భౌతికకాయంపై సిపిఎం నాయకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు, సీసన్ సురేష్, పల్లపు వెంకట్, పోడియం లక్ష్మణ్, మడకం రమేష్, సాధుల ధారయ్య, బాడిస శేషు, గూడూరు గ్రామస్తులు ఎర్ర జెండా కప్పి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ సుబ్బయ్య సేవలు మరువలేనివన్నారు. పార్టీ పట్ల దృఢవిశ్వాసం కలిగిన నాయకుడని చెప్పారు. గ్రామంలో పార్టీని విచ్ఛిన్న వాదులు నష్టపెట్టాలని చూస్తే, మడకం వెంకయ్య అడుగుజాడల్లో సుబ్బయ్య పార్టీని నిలబెట్టారని తెలిపారు. చింతూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి బంధువులు, ఒడిశా రాష్ట్రం నుండి వచ్చిన బంధువులు సుబ్బయ్యకు నివాళులర్పించారు.
ఇదీ ప్రస్థానం
1995లో సీపీఎంలో చేరిన సుబ్బయ్య చింతూరు సిపిఎం ఆఫీసు కార్యదర్శిగా పనిచేశారు. వివాహం అనంతరం గూడూరు గ్రామంలో పార్టీ నాయకునిగా పనిచేస్తూ గిరిజన సంఘం బాధ్యతలు చూశారు. గూడూరు పంచాయతీ సర్పంచిగా ఎన్నికై పంచాయితీలోని గ్రామాలలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించేందుకు, గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. పార్టీ గూడూరు గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఇంటర్ వరకు చదువుకున్న సుబ్బయ్య విద్యార్థి దశలోనే ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారు. క్రీడల్లో కూడా మంచి ప్రతిభ కనబరిచేవాడు. చింతూరులో పోలీసు నిర్వహించిన ఐదు కిలోమీటర్ల నడక పందెంలో విజేతగా నిలిచాడు. గ్రామస్తులతో బంధువులతో కలివిడిగా ఉండే సుబ్బయ్య చిన్నవయసులో మతి చెందడంపై గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.










