Oct 25,2023 21:54

ప్రజాశక్తి-కాకినాడ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజా రక్షణ భేరి యాత్రలో భాగంగా నవంబర్‌ 5, 6 తేదీల్లో కాకినాడ జిల్లాలో జరిగే యాత్రను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్‌లో సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి, కెఎస్‌.శ్రీనివాస్‌, జి.బేబిరాణి తదితరులుతో కలిసి పోస్టర్‌, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. బిజెపి బుల్డోజర్‌ రాజకీయాలతో అన్నదమ్ముల సమైక్యంగా మెలగవలసిన ప్రజల మధ్య కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్వేషాలను రాజేస్తోందన్నారు. బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాలలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. స్త్రీలను నగంగా నడిరోడ్డు మీద ఊరేగించి అదేదో తమ ఘనతగా మోడీ ప్రభుత్వం విర్రవీగుతోందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు కావస్తున్నా విభజన హామీలైన ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామయ్యపట్నం మేజర్‌ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వే జోన్‌ ఏర్పాటు వంటి ఏ ఒక్క హామీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తూ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కును తెగనమ్మటానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వైసిపి ప్రభుత్వ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు నామమాత్రంగా తయారవడంతో కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీకి సామాన్యులు బలైపోతున్నారన్నారు. లక్షలాది ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్‌ విషయంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి జిపిఎస్‌ పేరుతో జగన్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజలు తమ కష్టం గురించి చెప్పుకోవాలంటే వినడానికి ముఖ్యమంత్రికి ఒక్కరోజు కూడా తీరిక లేదన్నారు. ఎంతసేపూ నవరత్నాల గురించి తప్ప పెరిగే ధరలు, నిరుద్యోగం, గిట్టుబాటు లేని వ్యవసాయం, రక్షణ కరువైన చేతివృత్తులు, కౌలురైతులు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. పైగా కరెంట్‌ ఛార్జీలు, ఇసుక ధరలు ప్రభుత్వమే పెంచిందన్నారు. నిరసనను కూడా తెలియజేయడానికి వీలు లేకుండా నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు, బైండోవర్‌ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి పల్లెత్తుమాట అనకపోగా, పార్లమెంట్‌లో బిజెపిని బలపరుస్తోందన్నారు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను, రాష్ట్రాన్ని పూర్తిగా గాలికొదిలేశాయన్నారు. ప్రధాన పార్టీలు తమలో తాము అధికారం కోసం కుస్తీలు పడుతున్నాయన్నారు. ప్రమాదంలో పడిన మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలన్నా, సామాన్య ప్రజలకు నిజమైన ఊరట లభించాలన్నా ప్రజలే ఐక్యంగా కదలాలన్నారు. అప్పుడే కార్పొరేట్లకు రాష్ట్ర సంపదను కట్టబెట్టడంలో పోటీ పడుతున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపితో కలిసి ఆడుతున్న కపటనాటకానికి తెర దించగలమన్నారు. గతంలో విశాఖ ఉక్కు సాధన కోసం, ఎన్‌టిఆర్‌ ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, చంద్రబాబు విద్యుత్‌ ఛార్జీలు పెంచినప్పుడు బషీర్‌బాగ్‌ పోరాటంలో తెలుగువాడి సత్తా ఏమిటో చూపించామన్నారు. ఇప్పుడు మళ్లీ అటువంటి మహోద్యమం కోసమే సిపిఎం ప్రజారక్షణ భేరి మోగిస్తోందన్నారు. అందరూ కదలి వస్టే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధిని సాధించేందుకు కలిసి రావాలని పిలుపు ఇచ్చారు.