Nov 03,2023 21:55

కదిరిలో ర్యాలీ చేస్తున్న సిపిఎం శ్రేణులు

          అనంతపురం ప్రతినిది : సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరీ యాత్రకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిచింది. బుధవారం ప్రారంభం అయిన యాత్ర గురు, శుక్రవారాలు మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో యాత్ర కొనసాగింది. యాత్ర వెళ్లిన ప్రతి ప్రాంతంలోనూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్మికులు, రైతులు, ఉద్యోగులు, ప్రజలు ఇలా అన్ని వర్గాల వారూ వారి సమస్యలను యాత్ర బృందం సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. బస్సుయాత్ర నాయకత్వం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో స్థానిక సమస్యలను వివరిస్తూ, ప్రభుత్వాలు చేసిన మోసాన్ని తెలియజేస్తూ ప్రసంగించారు. ఈ ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేశాయి. ప్రభుత్వాలు చేస్తున్న మోసం వాస్తవమేనంటూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.
సిపిఎం ప్రజారక్షణభేరి బస్సుయాత్ర బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ప్రవేశించింది. శుక్రవారం కదిరితో ముగిసి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించింది. మూడు రోజుల పాటు సాగిన ఈ యాత్ర ఎనిమిది నియోజకవర్గాల్లో సాగింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ నేతృత్వంలో సాగిన యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, దయా రమాదేవి, శివనాగవేణి, భాస్కరయ్యలు పాల్గొన్నారు. యాత్రలో ప్రధానంగా రాయలసీమ ప్రాంతం వెనుకబాటు కారణాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నంతో సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాభివృద్ధికి ఇచ్చిన హామీల అమలు ఎంత వరకు వచ్చాయన్నది ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. రాయదుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్న కుదురేముఖ్‌, హంద్రీనీవా వెడల్పు, తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఆధునీకరణ తదితర అంశాలను ఈ పర్యటనలో ప్రజల ముందు ఉంచారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో అనేక మంది నిరుపేదలు ఇళ్ల కోసం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారన్నది యాత్ర బృందం ప్రస్తావించింది. గార్లదిన్నె మండలం కల్లూరులో నాలుగు సంవత్సరాలుగా ఉంటున్న నిరుపేదల ఇళ్లను కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ సందర్శించి, వారికి అండగా ఉంటామని భరోసానూ కల్పించారు. పెనుకొండ, చిలమత్తూరు తదితర ప్రాంతాల్లోనూ ఇళ్ల కోసం పేదలు చేస్తున్న పోరాటాన్ని బలపరిచారు. పేదల వైపు ఉంటామని చెప్పే ప్రభుత్వం ఎందుకు వారికి అండగా ఉండటం లేదని ప్రశ్నించింది. ఇక అదే సమయంలో కరువును ప్రధాన అజెండాగా ముందుకు తీసుకొచ్చింది. తీవ్రమైన కరువు పరిస్థితుల్లో కరువు మండలాల ప్రకటనలో కొన్ని మండలాలను మినహాయించడాన్ని తప్పుబట్టింది. తాము పర్యటిస్తున్న పుట్టపర్తి, కదిరి, నల్లమాడ మండలాల్లో తీవ్రమైన కరువున్నా ఎందుకు కరువు మండలాలు ప్రకటించలేదని ప్రశ్నించింది. ఈ ప్రాంతం నుంచి ఉపాధి కోసం వలసలు పోతున్న అంశాన్నీ ముందుకు తీసుకొచ్చింది. తక్షణం ఉపాధి హామీ పనులను కల్పించాలని యాత్ర బృందం ప్రస్తావించింది. కరువు నివారణ చర్యలు, ఉపాధి కల్పించే పరిశ్రమల ఆవశ్యకత , ఈ ప్రాంతాభివృద్ధికి పాలకులు తీసుకోవాల్సిన చర్యలు అన్నింటినీ ప్రజలకు వివరించి చైతన్య పరిచే ప్రయత్నం చేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు అభివృద్ధి, ప్రజా సమస్యలు రాజకీయాల్లో ప్రధాన అజెండా కావాలని యాత్ర ఉద్ధేశాన్ని ప్రజా రక్షణ భేరీ యాత్ర ప్రజలకు వివరించింది. అదికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను వదలి అధికారం కోసం పోటీపడుతున్నాయన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా అనేక చోట్ల ప్రజల నుంచి విశేషమైన స్పందన కనిపించింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న విధానాలు, ఈ ప్రాంతాభివృధ్ది అంశాలు ఆందరినీ ఆలోచింపజేసే విధంగా నాయకులు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతాల్లో సామాన్యులు కూడా ఈ అంశాలకు మద్దతుగా చర్చించుకోవడం కనిపించింది. యాత్ర బృందం దృష్టికి అనేక సమస్యలను కూడా ప్రజలు తీసుకెళ్లారు.
రాయలసీమకు అన్యాయం
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎం.గఫూర్‌ విమర్శించారు. సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరీ యాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ప్రారంభమైన యాత్ర నల్లమాడ మీదుగా కదిరికి చేరుకుంది. అక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువుకు వెళ్లింది. కదిరి, నల్లమాడలో నిర్వహించిన సభల్లో సిపిఎం నాయకులు ప్రసంగించారు. కదిరిలో గఫూర్‌ మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, అనంతపురం జిల్లాకు హంద్రీనీవా తీసుకొస్తామని, రాయదుర్గం వద్ద కుదురేముఖ్‌ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, చిత్తూరులో బెల్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, కర్నూలులో డిఫెన్సు ఫ్యాక్టరీ పెడతామని హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇందులో ఏ ఒక్క హామీని అమలు జరపకుండా మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద బిజెపి చెర నుంచి వైసిపి, టిడిపి, జననసేన పార్టీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోని బిజెపి ప్రభుత్వం వంద లక్షల కోట్లు అప్పులు చేసి మరీ కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. నల్లమాడలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో సిపిఎం ప్రజా సమస్యలపైన నిరంతర పోరాటం సాగిస్తోందన్నారు. సబ్‌ ప్లాన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాలకు కేంద్రం ప్రకటించిన మేరకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజా, కార్మిక, రైతు, ఉద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 15 తేదీన సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.