
ప్రజాశక్తి - దుగ్గిరాల : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర రాయలసీమ నుండి బయలుదేరి మంగళగిరికి 9న వస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు తెలిపారు. బస్సు యాత్రతోపాటు 15న విజయవాడలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు మండలంలోని మంచికలపూడిలో మంగళవారం ప్రచారం చేయగా అప్పారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు, కేంద్ర విద్యా సంస్థలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్ లాంటివి ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేస్తోందని, మతకలహాలు సృష్టిస్తూ దేశ ఐక్యతకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తోందని విమర్శించారు మరోవైపు నిత్యావసర సరుకులు ధరలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాల్లో పనుల్లేక అవస్థ పడుతున్నారని చెప్పారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు వేసిందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని విమర్శించారు. రేవేంద్రపాడులో మద్రాస్ కాల్వపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందోనని ప్రజల ఆందోళన చెందుతున్నారని, ఈ విషయాన్ని తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోవడం లేదని అన్నారు. ఈ సమస్యలపై సిపిఎం నిర్వహించే పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు, నాయకులు వై.బ్రహ్మేశ్వరరావు, ఎ.పాములు, వై.కొండలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : ఈ నెల 15న విజయవాడలో జరిగే సిపిఎం ప్రజారక్షణ భేరి సభను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు వి.దుర్గారావు పిలుపునిచ్చారు. పట్టణంలోని నులకపేటలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎ.శౌరిబర్తులం, వి.శాస్త్రి, ఎన్.దుర్గారావు, తులసమ్మ, సుశీల పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మేడికొండూరు : మండలంలోని జమ్మికుంటపాలెం, భీమినేనివారి పాలెంలో కరపత్రాల పంపిణీ ద్వారా ప్రచారం చేశారు. బి.రామకృష్ణ, ఎస్కే షరీఫ్, పి.నాగేశ్వరరావు, వై.సుబ్బారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధానిలోని మందడంలో ప్రచారం నిర్వహించగా సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి మాట్లాడారు. నాయకులు వి.వెంకటేశ్వరరావు, కె.ఆంజన ేయులు, వై.శ్రీనివాసరావు, పి.బాబురావు, సిహెచ్ నందజీ, ఎం.నాగరాజు, పి.వెంకటేష్, జి.ఆంజనేయులు, షేక్ సుభాని, వెంకటేశ్వరరావు, సిహెచ్ కృష్ణారావు పాల్గొన్నారు.