
ప్రజాశక్తి అద్దంకి
నిత్యవసర వస్తువులు ధరలు ఎన్నడూ లేని విధంగా పెరిగాయని సిపిఎం మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్రను జయప్రదం చేయాలని మండల పాదయాత్రను గురువారం ప్రారంభించారు. మహిళా కార్మికుల సైతం మేమున్నామని ప్రజారక్షణ భేరీ బస్సుయాత్ర కరపత్రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 7న జరిగే సిపిఎం బస్సు యాత్ర జయప్రదం చేయాలని కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతం కార్మిక, కర్షకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, ఇంధన చార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. అద్దంకి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మరణించిన వారి కుటుంబాలు వీధిపాలవుతున్నాయని అన్నారు. ప్రమాదాలకు కారణం బైపాస్ రోడ్డు లేకపోవడమేనని అన్నారు. అంతర్గత రోడ్లు, మంచినీటి పైపులు వేసేందుకు త్రవ్వడం వలన రోడ్లు గుంతలమయం అయ్యాయని అన్నారు. పట్టణ ప్రజల సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, మహిళలుపాల్గొన్నారు.