Sep 26,2023 18:31

ప్రజాశక్తి - వీరవాసరం
             సిపిఎం నవుడూరు శాఖ కార్యదర్శిగా అయినపూడి బాబూరావును గ్రామ శాఖా సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు శాఖ సమావేశాన్ని లింగం సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఇప్పటివరకు శాఖ కార్యదర్శిగా ఉన్న మారియ్యనాయుడు కుటుంబ ఇబ్బందుల రీత్యా బాధ్యతల నుంచి తొలిగారు. శాఖ సమావేవంలో సీనియర్‌ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రజా ఉద్యమంపై ప్రభుత్వం దమనకాండ ఆపకపోతే భవిష్యత్తులో నష్టపోయేది ప్రభుత్వామేనన్నారు. పాదయాత్రలో జగన్‌ చేసిన వాగ్ధానాలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ, ఆశ, కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు చేపట్టిన ఉద్యమాలపై పోలీసులతో నిర్భంధం ప్రయోగించడం, అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నాలుగేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు, ఐదు సార్లు బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపారన్నారు. చెరువులను తలపించే విధంగా రహదారులు దర్శనమిస్తుంటే మరమ్మతులు కూడా చేయకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలపై గ్రామాల్లో పర్యటించి ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యాళ్లబండి మారియ్యనాయుడు, తాళ్లూరి రాము, యాళ్లబండి నారాయణమూర్తి, మైగాపుల త్రిమూర్తులు పాల్గొన్నారు.