నివాళులుర్పించిన నేతలు
ప్రజాశక్తి - ఏలూరు
సిపిఎం నగర కమిటీ మాజీ సభ్యులు, సీనియర్ నేత తాన్న రంగారావు (80) బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మృతి పట్ల సిపిఎం జిల్లా, నగర కమిటీలు సంతాపం తెలిపాయి. రంగారావు అంత్యక్రియలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారావు భౌతికకాయాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, నగర కార్యదర్శి పి.కిషోర్, నాయకులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రంగారావు అంతిమయాత్ర చోడిదిబ్బలోని రంగారావు నివాసం నుండి అశోక్‌నగర్ శ్మశాన వాటిక వరకు సాగింది. అనంతరం అక్కడ జరిగిన సంస్మరణ సభకు సీనియర్ నాయకులు కంది విశ్వనాధం అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ తాన్న రంగారావు జ్యూట్‌మిల్లు కార్మికునిగా పని చేస్తూనే, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎంలో క్రియాశీల కార్యకర్తగా పని చేశారన్నారు. ఆయన భార్య తాన్న సింహాచలం కూడా మహిళా ఉద్యమంలో పనిచేసి రౌడీమూకల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రంగారావు కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్నప్పటికీ ప్రజల కోసం పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉండేవారని అన్నారు. రంగారావుకు నివాళులర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.లింగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బి.సోమయ్య, నాయకులు విశ్వనాథం, పి.ఆదిశేషు, వి సాయిబాబు, బి.జగన్నాథరావు, కె.రామాంజనేయులు, ఎం.కనకారావు, జి.ఏసుబాబు, మీసాల సత్యం, స్థానిక పెద్దలు సింహాచలం, అల్లం వెంకటేశ్వరరావు, శేఖర్ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర, సీనియర్ నేతల సంతాపం
తాన్న రంగారావు మతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, సీనియర్ నాయకులు, మాజీ ఎంఎల్‌ఎ ఆర్.సత్యనారాయణరాజు (ఆర్‌ఎస్), మహిళా ఉద్యమ నేత అల్లూరి మన్మోహన్ (అమ్మాజీ), సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం, సీనియర్ నేత చింతకాయల బాబూరావు, సిఐటియు పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు, ఏలూరు జిల్లా కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ తదితరులు రంగారావు మృతి పట్ల సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.










