Apr 11,2023 00:35

సమైక్య అపార్ట్‌మెంట్‌లో నివాళులర్పిస్తున్న వెంకటేశ్వరరావు తదితరులు

ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం సీనియర్‌ నాయకులు జి.సుబ్బారావు సంతాప సభలు నగరంలో పలుచోట్ల సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అరుణోదయ కాలనీలో సంతాప సభ
గాజువాక : అరుణోదయ కాలనీలో జి.సుబ్బారావు సంతాప సభ సోమవారం సాయంత్రం నిర్వహించారు. సుబ్బారావు చిత్రపటానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.రాజేంద్రప్రసాద్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన వ్యక్తి సుబ్బారావు అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌, కృష్ణ, శ్రీదేవి, పార్టీ సానుభూతిపరులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సమైక్య అపార్ట్‌మెంట్‌లో...
సిపిఎం సీనియర్‌ నాయకులు, ఉద్యమ నేత జి.సుబ్బారావు సంతాప సభ సోమవారం సమైక్య అపార్ట్‌మెంట్‌ లైబ్రరీ హాల్లో నిర్వహించారు. సుబ్బారావు చేసిన సేవలను, అపార్ట్‌మెంట్‌ సమస్యలపై అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమైక్య అపార్ట్‌మెంట్‌ కమిటీ ప్రెసిడెంట్‌ వెంకటేశ్వరరావు, సెక్రెటరీ పి.తవిటయ్య, మహిళా కమిటీ ప్రెసిడెంట్‌ మణి, కమిటీ సభ్యులు రామన్న, భాస్కరరావు, గౌరవ్‌, ప్రసాద్‌, శంకరరావు పాల్గొన్నారు.
మధురవాడ : ఎపి మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) మధురవాడ కమిటీ ఆధ్వర్యాన చంద్రంపాలెం హైస్కూల్‌లో సిఐటియు సీనియర్‌ నాయకుడు జి.సుబ్బారావు సంతాప సభ సోమవారం నిర్వహించారు. సుబ్బారావు చిత్రపటానికి నక్క అప్పారావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యూనియన్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఎంవి.ప్రసాద్‌ మాట్లాడుతూ, మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై సుబ్బారావు అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ నాయకులు కె.నాగరాజు, యూనియన్‌ నాయకులు ఎస్‌.రామప్పడు, సిహెచ్‌.శేషుబాబు, కొండమ్మ, జి.కిరణ్‌, బి.రాంబాబు, కె.రాజు, కె.అర్జునమ్మ పాల్గొన్నారు.