Aug 20,2023 22:49

ఫొటో : నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

సిపిఎం నాయకులు ఖాజావల్లి మృతి
- పలువురు సంతాపం
- ఖాజావలి అవయవాలు దానం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : సిపిఎం సీనియర్‌ నాయకులు షేక్‌ ఖాజావలి (85) వృద్ధాప్యం కారణంగా ఆయన కుమార్తె నివాసంలో శనివారం రాత్రి 4.30 గంటలకు తుది శ్వాస విడిచాడు. ఆయన స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ తుదిశ్వాస వరకు పార్టీ శ్రేయస్సు కోసం పనిచేశాడు. స్వగ్రామం ఎఎస్‌పేట మండలం గుడిపాడు గ్రామం. ఖాజావలి రైతు సంఘం - కార్మిక సంఘం, ఆంధ్ర ప్రజానాట్యమండలిలో చురుకైన కార్యకర్తగా పనిచేశాడు. గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో పేద ప్రజల హక్కుల కోసం వారి సమస్యలపై పోరాటాలు చేశారు.
ఖాజావలి తన మరణాంతరం తన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగంగా ఉండే విధంగా వైద్యశాలకు అప్పగించాలని కోరుతూ నెల్లూరు పినాకిని దేహ సమర్పకుల సంస్థకు గత 20 సంవత్సరాలలో క్రితం దేహ సమర్పణ ప్రమాణ పత్రం అందజేశారు. ఆయన కోరిన విధంగా కుటుంబ సభ్యులందరూ అంగీకరించి ఆయన భౌతికకాయాన్ని వైద్యశాలకు అప్పగించారు. ఖాజావలీ భౌతికకాయాన్ని ప్రజలు సందర్శనార్థం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఉంచారు. అనంతరం అక్కడ స్మారక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌ రాజు నిర్వహించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సిపిఎం జిల్లా నాయకులు గంటా లక్ష్మీపతి, న్యాయవాది శేషారెడ్డి, కెవిపిఎస్‌ నాయకులు ఆత్మకూరు నాగయ్య, టౌన్‌ పార్టీ నాయకులు షేక్‌ సంధాని, ఎం నాగేంద్ర, పి.జిలాని, రైతు సంఘం నాయకులు లక్కు ప్రసాద్‌, సిఐటియు నాయకులు జివి శివప్రసాద్‌, కొండమూరి హజరత్తయ్య, ఆళ్ల హజరత్తయ్య, వాగాల శ్రీహరి, హరికృష్ణ, ఎల్‌ఐసి రమేష్‌, ఐద్వా నాయకురాలు గుల్జార్‌ బేగం, కొండా లక్ష్మమ్మ, కెవిపిఎస్‌ నాయకులు వెంకటయ్య, ఖాజావలి కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొని ఖాజావలి మృతికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.