కన్నారావు మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-చింతూరు : చింతూరు మండలం వేకవారిగూడెం గ్రామానికి చెందిన సిపిఎం శాఖ కార్యదర్శి ఉయక కన్నారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా, మండల నాయకులు సీసం సురేష్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, పల్లపు వెంకట్ తదితరులు కన్నారావు మృతదేహాన్ని సందర్శించి, ఎర్ర జెండా కప్పి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పార్టీ అభివృద్ధికి ఉయక కన్నారావు నిరంతరం కృషి చేశారని కొనియాడారు. పార్టీ ఎప్పుడు, ఏ పిలుపు ఇచ్చినా అమలు చేసేవాడని పేర్కొన్నారు. అతి చిన్న వయసులో చనిపోవడం ఆ కుటుంబానికి, సిపిఎంకు తీరని లోటన్నారు. కన్నారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు. కన్నారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.










