Nov 13,2023 22:11

ప్రజాశక్తి - చాగల్లు అసమానతలు లేని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఈ నెల 15న విజయవాడలో సిపిఎం నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకుడు ఎం.సుందర బాబు పిలుపునిచ్చారు. సోమవారం బహిరంగ సభ గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా చాగల్లులోని వివిధ సెంటర్లలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను, పాలక ప్రభుత్వాలను మోసగించిన కేంద్రంలోని బిజెపిని 2024 ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శం చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిందని దుయ్యబట్టారు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరిం చిందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంపుదల చేసి ప్రజలపై మోయలేని భారాలను వేసిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు తాకట్టు పెట్టిందని దుయ్య బట్టారు. అటువంటి బిజెపి పార్టీతో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మద్దతుగా నిలవడాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. 30 డిమాండ్లను సాధించుకునే లక్ష్యంతో సిపిఎం ఈ నెల 15న విజయవాడలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్య క్రమంలో మండల శాఖ కార్యదర్శి కెకె.దుర్గారావు, కంకటాల బుద్ధుడు, గారపాటి వెంకటసుబ్బారావు, జుజ్జవరపు శ్రీను, ఎస్‌కె.ఆదాం, కొఠారు నాగేశ్వరరావు, సిహెచ్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.