ప్రజాశక్తి-కందుకూరు నెల్లూరు జిల్లా సమగ్రాభివద్ధి సాధన కోసం నేటి నుంచి 13వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య తెలిపారు. ఈ పాదయాత్రకు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నాయకత్వం వహిస్తారని తెలిపారు. సిపిఎం పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం కందుకూరు సుందరయ్య భవన్ లో నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కొత్తగా నెల్లూరు జిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గం అన్నీ రంగాలలో అభివద్ధి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముప్పరాజు కోటయ్య పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గంలో అన్యాకాంతమైన భూములను ఎస్సీ ఎస్టీల తిరిగి వారికే స్వాధీనం చేయాలని కోరారు. చిన్న పవని విత్తన క్షేత్ర భూములను 545 ఎకరాలు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఉలవపాడు నుండి చుట్టుగుంట మీదగా కందుకూరు వరకుఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు. గుడ్లూరు,కందుకూరు పట్టణాలలో రోడ్ల విస్తరణ చేయాలని కోరారు. సోమశిల ప్రాజెక్టు నుండి రాళ్లపాడు వచ్చే నీటి కాలువను వెడల్పు చేసి 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఉత్తరకాలను పొడిగించి వలేటివారిపాలెం మండలంలోని అన్ని చెరువులను ప్రాజెక్టు నీటితో నింపాలని, రైతులను ఆదుకోవాలని కోరారు. కందుకూరు పట్టణంలోని వెంకటాద్రిపాలెం రైతుల సాగులో ఉన్న 999 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చి హక్కును కల్పించాలని కోరారు.ఉలవపాడు మండలంలోని గిరిజన కాలనీలకు కనీస సౌకర్యాలైన మంచినీళ్లు, సిమెంట్ రోడ్లు సైడ్ కాలవలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. పాదయాత్ర ఈ సమస్యలన్నింటిపై ప్రస్తావన చేస్తామని ముప్పరాజు కోట పేర్కొన్నారు. కరపత్రాలు విడుదల చేసిన వారిలో సిపిఎం కందుకూరు గుడ్లూరు ఉలవపాడు మండల కార్యదర్శులు ఎస్ ఏ గౌస్, జి వెంకటేశ్వర్లు,జీవీబీ కుమార్, కందుకూరు పట్టణ నాయకులు దాసరి రామ్మూర్తి, డి ఎం రాయుడు తదితరులు ఉన్నారు.










