ప్రజాశక్తి-పాడేరు: జీవో 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పాడేరులో మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం మండల కార్యదర్శి ఎల్.సుందర్ రావు మాట్లాడుతూ, జీఓ 3 ను రద్దు చేసి నేటికీ రెండున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్నా చట్టబద్ధ కల్పించ లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ నోటిపికేషన్ లేక గిరిజన యువత తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సిఎం జగన్ సీపీస్ రద్దు హామీలు అమలు చేయకపోగా గత సంవత్సర కాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాలికి లక్కు, డి. బొజ్జన్న, చిట్టిబాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కక్ష సాధింపు మానుకోవాలి: సురేంద్ర
అరకులోయరూరల్:ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులపై ప్రభుత్వం వేధింపులు చర్యలు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కీల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, జిఓ 1 పేరుతో బహిరంగ ప్రదేశాల్లో ఆందోళనలు, సభలపై ఆంక్షలు పెట్టి ప్రజల గొంతును నొక్కడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, నాయకులు పొద్దు బాలదేవ్, జి.బుజ్జి బాబు, టి.జోషి, పి.నానిబాబు, పి.రామన్న, కె మగ్గన్న, కూర్మన్న, మురళి వివి.జయ, కె.మగ్గన్న, జె.భగత్ రామ్ తదితరులు పాల్గొన్నారు.










