Dec 31,2022 22:06

ప్రజాశక్తి - పెదపాడు
           పాతతరం కమ్యునిస్టు నేత, సిపిఎం అభిమాని, నాయుడుగూడెం పంచాయతీ మాజీ సర్పంచి అక్కినేని సత్యనారాయణ(సత్యం) (94) వయోభారంతో శనివారం మృతి చెందారు. ఆయన భార్య గతంలోనే మృతిచెందారు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ఒకరు మృతిచెందారు. కమ్యూనిస్టు భావజాలం కలిగిన ఆయన అక్కినేని శ్రీవల్లీ నర్రా ఆంజనేయులు ట్రస్టు పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అక్కినేని శ్రీవల్లీ గ్రంథాలయాన్ని స్థాపించి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం పోటీలు నిర్వహించి వారికి ప్రోత్సాహాకాలు అందిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన వయోభారంతో మృతిచెందారు. సత్యం మృతదేహాన్ని ఆశ్రం మెడికల్‌ కళాశాలకు అందించారు. ఆయన మృతికి సిపిఎం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా కమిటీలు సంతాపం తెలిపాయి. సిపిఎం సీనియర్‌ నాయకులు ఆర్‌.సత్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం, ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా నాయకులు చింతకాయల బాబూరావు, కె.రాజారామ్మోహన్‌ రారు, పివి.ప్రతాప్‌, కె.శ్రీనివాస్‌, పళ్లెం కిషోర్‌ ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్కినేని సత్యం కమ్యునిస్టు ఉద్యమానికి, ప్రజా సంఘాలు ఉద్యమాలకు ఎంతో మద్దతుగా నిలిచారన్నారు. వామపక్ష భావాలతో జీవించిన సత్యం మృతి తరువాత కూడా సమాజానికి ఉపయోగపడేలా ఆయన మృతదేహాన్ని మెడికల్‌ కాలేజీకి డొనేట్‌ చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. ఇది ఎంతో అభినందనీయన్నారు.