ప్రజాశక్తి-చీరాల: ప్రస్తుత సమాజంలో పని ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే అనేకమంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడి గుండెపోటుతో మృతి చెందుతున్నారని, అయితే ఆ సందర్భంలో ప్రథమ చికిత్స అయిన సిపిఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నట్లయితే ప్రాణాలు కోల్పోకుండా వ్యక్తిని బతికించేందుకు అవకాశం ఏర్పడుతుందని రోటరీ అధ్యక్షులు, గుండె వైద్య నిపుణులు డాక్టర్ బాబురావు అన్నారు. శుక్రవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సెయింట్ మార్క్ లూథరన్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఆయన గుండె జబ్బుల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబురావు మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. గుండె వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ఆహారం, చేయవలసిన వ్యాయామాలు, గుండె నొప్పి వస్తే, అంబులెన్స్ వచ్చే లోపల చేయవలసిన ప్రథమ చికిత్స గురించి వివరంగా తెలియజేశారు. మనిషి గుండె బొమ్మను చూపిస్తూ, విద్యార్థులతో సిపిఆర్ చేయించి వారికి అవగాహన కల్పించారు. అనంతరం వారికి పలు ఆరోగ్య సూచనలను చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










