Mar 01,2023 21:49

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్ట్‌ చేసి జీపు ఎక్కించిన పోలీసులు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్ట్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       నంద్యాలకు విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నంద్యాల పట్టణంలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నంద్యాలకు వచ్చారు. సమావేశం అనంతరం ఆయన బయటకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నేడు 2వ తేదీ విజయవాడలో జరిగే మహా ధర్నాలో పాల్గొనకూడడంటూ కె.రామకృష్ణను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, నాయకులు రమేష్‌, బాబా ఫకృద్దీన్‌లు అరెస్టును అడ్డుకుంటూ నిలబడ్డారు. పెద్ద ఎత్తున సిఐలు, ఎస్‌ఐలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు నాయకులను బలవంతంగా ఈడ్చివేసి రామకృష్ణను పోలీస్‌ కారులోకి ఎక్కించారు. కారుకు అడ్డుపడిన సురేష్‌, దనుంజయుడులను ఈడ్చి వేశారు. అందరినీ నంద్యాల 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
సిపిఐ రామకృష్ణ అక్రమ అరెస్టుకు సిపిఎం జిల్లా కమిటీ ఖండన
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం నంద్యాల జిల్లా కమిటీగా బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలకు వచ్చిన రామకృష్ణను ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ తీవ్రంగా ఖండించారు. టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాల సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రజల తరఫున పోరాడుతుంటే అరెస్టు చేయడం సిగ్గుచేటని, వెంటనే రామకృష్ణను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.