ప్రజాశక్తి- నక్కపల్లి:జీవో 1 రద్దుకు పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో 20న చేపట్టనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ఆదివారం మండలంలోని చీడిక గ్రామంలో సిపిఐ నేత అజరు ఇంటికి వెళ్లి ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అజరు మాట్లాడుతూ పోలీసులు తనను విజయవాడ వెళ్లకుండా అడ్డుకొని హౌస్ అరెస్టు చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు జరప కూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జిఓ 1 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులు, నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరన్నారు.
పాయకరావుపేట:సభలు, సమావేశాలు, రోడ్డుషోలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బ్రిటిష్ కాలం నాటి జీవో 1 రద్దు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి వెలుగుల అర్జున్‌రావు డిమాండ్ చేశారు. చలో అమరావతి నేపథ్యంలో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. భారీగా పెంచిన డీజిల్, పెట్రోలు, వంటగ్యాసు, విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను లకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు జరిపే పోరాటాలను అణిచి వేయడానికి తీసుకువచ్చిన బ్రిటిష్ కాలం నాటి జీవో 1 రద్దు చేయాలని లేని పక్షంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని హెచ్చరించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుని గమనిస్తే రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికలలో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించి ప్రజల మన్నలను పొందాలని సూచించారు. లేని పక్షంలో ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు.










