Nov 18,2023 00:16

ప్రజాశక్తి - సంతమాగులూరు
జిల్లాలో కరువు నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. మండలంలోని ఏల్చూరులోని బస్టాండ్ సెంటర్‌లో ఈనెల 20, 21తేదీలలో విజయవాడలో జరిగే 30 గంటల నిరసన దీక్షకు సంబంధించిన గోడ పత్రిక శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపుగా 440 మండలాల్లో కరువు తాండవిస్తుందని అన్నారు. ఆయా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సి ఉండగా కేవలం 101 మండలాలు మాత్రమే ప్రకటించడం దారుణమని అన్నారు. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయి విల విలలాడి పోతుంటే అధికార పార్టీ  నాయకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని అన్నారు. ఎలాంటి సహాయక చర్యలు చేపట్టక పోవడం దారుణమని అన్నారు. నాగార్జున సాగర్ కుడికాలువ కింద 90శాతం సాగు నీటి ఎద్దడి వల్ల రైతులు పంటలు సాగు చేయలేదని అన్నారు. రైతులు విజయవాడలో జరిగే నిరసన దీక్షకు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు అద్దంకి నాగేశ్వరరావు, మేకల రమణయ్య, ప్రసాదు, ఆంజనేయులు, దుర్గాప్రసాద్, మొగిలి వెంకటేశ్వర్లు, ఏలూరు రామం పాల్గొన్నారు.