Oct 20,2023 20:23

మూతపడిన సిపి ఆక్వాపరిశ్రమ

 ప్రజాశక్తి - పూసపాటిరేగ :  మండలంలోని జి.చోడవరంలోగల సిపి ఆక్వా రొయ్యల మేత పరిశ్రమకు యాజమాన్యం తాత్కాలికంగా తాళాలు వేసింది. పరిశ్రమలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు, యాజమాన్యం మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. పరిశ్రమను తాత్కాలికంగా మూత వేసేదిశగా తీసుకువెళ్లింది. పరిశ్రమకు రోజువారీ కూలి నిమిత్తం కార్మికులను సరఫరా చేస్తున్న ఏడుగురు కాంట్రాక్టర్‌ల ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు నోటీసు బోర్డులో పేర్కొంది. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్లు, కార్మికులు, ఉద్యొగుల్లో ఆందోళన మొదలైంది.
పరిశ్రమలో 270 మంది పర్మినెంటు ఉద్యోగులు, సుమారుగా 500 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఈనెల 18న 50 మంది ఒప్పంద కార్మికులను ఒక విభాగం నుంచి వేరే ఒక విభాగానికి మార్చడంతో వాగ్వివాదం తలెత్తింది. దాంతో బాధిత కార్మికులు పరిశ్రమలో ఆందోళన చేపట్టారు. యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. దీంతో యాజమాన్యం తాత్కాలికంగా పరిశ్రమను మూసేసినట్లు తెలుస్తుంది.
కాంట్రాక్టర్లు రద్దు చేస్తూ నోటీసు
పరిశ్రమలో కార్మికులను సరఫరా చేస్తున్న ఆర్‌కె ఎంటర్‌పైజస్‌, బిఎస్‌ఎన్‌ ఎంటర్‌ప్రైజస్‌, ఎస్‌ఎస్‌బి కనస్ట్రక్సన్స్‌, శ్రీ సంతోషి మ్యాన్‌పవర్‌ కాంట్రాక్టర్‌, కె. కూర్మారావు కాంట్రాక్ట్‌, ఎన్‌. అప్పన్న కాంట్రాక్ట్‌, శ్రీ సాయిరామ్‌ ఎంటర్‌ప్రైజస్‌, కొత్తకోట శ్రీరాములు కాంట్రాక్ట్‌ రద్దు చేస్తూ నోటీసు బోర్డులో ప్రకటించింది. దాంతో పాటు పరిశ్రమలో సెప్టెంబర్‌ ఒకటో తేది నుండి ముడి సురుకు తగ్గడంతో సీడ్‌ ఉత్పత్తి నిలిపివేసినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల్లో అశాంతి నెలకొని కార్మికులు హింసాత్మకంగా మారి పరిశ్రమకు అపార నష్టం కలగజేసారని, దాంతో ఈ నెల 20 వ తేది నుండి కాంట్రాక్టలను రద్దు చేస్తున్నామని నోటీసులో పేర్కొన్నారు. ఈ కార్మికులకు ఎవరికీ పరిశ్రమలోనికి ప్రవేశం లేదని నోటీసులో పేర్కొన్నారు.
పరిశ్రమలో బౌన్సర్లతో కాపలా
కాంట్రాక్టులు రద్దు చేసిన నేపధ్యంలో పరిశ్రమలో ఉన్న తారులాండ్‌ యాజమాన్యానికి రక్షణగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. యాజమాన్యానికి ఎటువంటి హాని కలగకుండా రక్షణ కవచం ఏర్పాటు చేసినట్లు యాజమాన్య ప్రతినిధులు తెలిపారు.