Jul 31,2022 23:17

సిపాయిలు తిరగబడ్డారు..!

సిపాయిలు తిరగబడ్డారు..!
ప్రజాశక్తి - విశాఖపట్నం    
స్వాతంత్య్రోద్యమంలో సిపాయిల తిరుగుబాటుకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పనక్కర్లేదు. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందని ఎవర్నయినా ప్రశ్నిస్తే 1857లోనని ఠక్కున జవాబిస్తారు. అయితే, దీనికి 77 ఏళ్ల కిందటే విశాఖపట్నంలో సిపాయిలు అధికారులపై తిరుగుబాటు చేశారు. 1780 అక్టోబర్‌ 3న ఈ సంఘటన జరిగింది.
అప్పటి కర్నాటకలోని మైసూరు ప్రాంతాన్ని హైదరాలీ పాలించేవాడు. బ్రిటిష్‌ అధికారులకు అతడు సింహస్వప్నమే అయ్యాడు. అతడి ధాటికి తాళలేని బ్రిటిష్‌ ప్రభుత్వం భారీ సైనిక బలగాలతో అణచి వేయాలని నిర్ణయించింది. అప్పట్లో మద్రాసులో ఉన్న సైనికబలం ఇందుకు సరిపోదని భావించిన ప్రభుత్వం విశాఖ నుంచి సైనికుల్ని ఇందుకోసం తరలించాలని భావించింది. అప్పట్లో విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో సైనికులు భారీ సంఖ్యలో ఉండేవారు. ఆ కాలంలో విశాఖ నుంచి మద్రాసు వెళ్లాలంటే నౌకాయానం తప్ప మరో మార్గం ఉండేది కాదు. అప్పట్లో హిందూ సంప్రదాయం ప్రకారం సముద్రంమీద ప్రయాణం తప్పుగా భావించేవారు. మద్రాసు వెళ్లి పోరాడాల్సింది కూడా భారతీయుడిపైనే. ఈ కారణాలవల్ల విశాఖ నుంచి సైనికులు మద్రాసు వెళ్లడానికి విముఖత చూపారు. అయితే, అధికారుల ఆజ్ఞల మేరకు ప్రయాణానికి సన్నాహాలు జరిగాయి. సిపాయిలు రిసాట్‌ అనే అధికారి సారథ్యంలో 'సారిటన్‌ ఫ్రిగేడ్‌' అనే నౌకలో మద్రాసు చేరుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా ఒక అధికారి సిపాయిలకు విందు ఏర్పాటు చేశారు. సిపాయిలంతా నౌక ఎక్కడానికి ముందు కవాతు చేయాల్సి ఉంటుంది. దీనిని తిలకించడానికి బ్రిటిష్‌ అధికారులు వచ్చారు. 1780 అక్టోబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సిపాయిలు నౌక ఎక్కాల్సివుంది.
అంతే... సైనికుల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బద్దలైంది. నౌక ఎక్కడానికి సైనికులు నిరాకరించారు. దీంతో, అధికారులు తుపాకులు గురిపెట్టి బలవంతంగా నౌక ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో సైనికులకు, అధికారులకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరాటంలో లెఫ్టినెంట్‌ క్రిస్ట్స్‌, కింగ్స్‌ ఫోర్డ్‌ విన్నర్‌, రాబర్ట్‌ రూథర్‌ఫర్డ్‌ (సిపాయిలకు జీతాలిచ్చే అధికారి), ఒక క్యాడెట్‌ అక్కడికక్కడే మరణించారు. ఛార్లెస్‌ మాక్స్‌టోన్‌ అనే అధికారి తలకు బలమైన గాయాలయ్యాయి. మరో అధికారి రాబర్ట్‌కు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సైనికుల ఆగ్రహంతో భయాందోళనలకు గురైన నౌక కెప్టెన్‌ లేక్‌ కొంతమంది సిపాయిల సహాయంతో పారిపోయి దాక్కున్నాడు. మిగతా యూరోపియన్లు కూడా పలాయనం చిత్తగించారు. విశాఖ గవర్నర్‌ కాసనేజర్‌ను సైనికులు బంధించారు. ఈ సందర్భంగా ఒక ఫ్రెంచి గూఢచారిని సిపాయిలు విడుదల చేశారు. ఈ సైనిక తిరుగుబాటుకు సుబేదార్‌ షేక్‌ మహమ్మద్‌ నాయకత్వం వహించాడు. ఈ తిరుగుబాటు సందర్భంగా 24 గంటలపాటు విశాఖలో స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడింది. కాసనేజర్‌ను చంపేస్తామంటూ బెదిరించారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించి, ఈస్టిండియా కంపెనీకి చిల్లు పెడుతున్న కాసనేజర్‌ ఈ దాడితో హడలిపోయాడు. బ్రిటిష్‌ ఉద్యోగుల నుంచి రూ.21,999, ఖజానా నుంచి రూ.15 వేలు సైనికులు స్వాధీనం చేసుకున్నారు. మర్నాడు అంటే అక్టోబర్‌ 4న కాసనేజర్‌చేత రెండు ఒప్పందాలపై సైనికులు సంతకాలు చేయించుకున్నారు. డిస్మిస్‌కు గురైన పర్లాకిమిడి జమీన్‌దారు గజపతి నారాయణ్‌దేవ్‌ను తిరిగి జమీన్‌దారుగా గుర్తించాలని, మద్రాసు పంపిన సిపాయిలను వెనక్కు రప్పించాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ తిరుగుబాటు ఫలితంగా సైనికుల సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వారి జీతభత్యాలు పెంచారు.
ఈ తిరుగుబాటుకు ప్రతీకార చర్యగా కొన్ని నెలల తరువాత సుబేదార్‌ షేక్‌ మహమ్మద్‌ను, తిరుగుబాటులో ముఖ్య పాత్ర పోషించిన మరికొంతమందిని బ్రిటిష్‌ కసాయి మూకలు ఫిరంగులకు కట్టి కాల్చి చంపాయి. ఈ తిరుగుబాటులో మృతి చెందిన బ్రిటిష్‌ అధికారుల సమాధులు పాత పోస్టాఫీసు వద్ద ఉన్న డచ్‌ సమాధుల్లో ఉన్నాయి. అయితే, వీటి గురించి పట్టించుకున్నవారే లేరు. ఇంకా ఈ సంఘటనకు సంబంధించిన స్మృతులు చెన్నైలోని ఫోర్ట్‌ సెయింట్‌జార్డ్‌ మ్యూజియంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.