Jul 04,2021 11:25

ఉదయాన్నే వాళ్ళు అడుగుపెడితే
రోడ్లన్నీ ఆనందంతో నవ్వుతాయి
పురివిప్పి నెమలి నాట్యమాడినట్లు
వీధులన్నీ చిందులు వేస్తాయి
హృదయంలో వెక్కిరిస్తున్న
కష్టాల గదులకు తాళం వేసుకొని..
నిశీధి వీధుల్లోకి...కళ్ళలో వెలుగును
నింపుకొని బయలుదేరతారు

సుప్రభాత సమయాన....
రవి కిరణాలు భువిని చేరకముందే
మంచు తెరలను చీల్చుకుంటూ
వీధి శునకాలన్నీ వారిని చూసి
అరుస్తూ ఉన్నా....
వీధి దీపాల కాంతుల్లో
చేతిలో చీపురులనే
ఆయుధాలతో రోడ్డెక్కుతారు

వాళ్ళ ఉదరం నిండేది
ఇరానీ చారులు...మయూరి హోటళ్ల
టిఫిన్‌లతో కాదు.
దుర్గంధాల వాసనతో...
డ్రైనేజీ కంపులతోనే.

వాళ్ళ శరీర సౌందర్యాన్ని చూసి
అందరూ చీదరించుకుంటారు
మన వీధుల్లో మలినాన్ని దూరం చేసి
వారి దేహానికి మురికంటించుకుంటూ....
రోడ్లన్నింటినీ మెరిపిస్తుంటారు.

పొద్దస్తమానం వారు స్నేహం చేసేది
చెత్తకుప్పలతో... ప్లాస్టిక్‌ వ్యర్థాలతో....
మురికి కాలువలతోనే...
దోసెడు మెతుకుల కోసం
అనునిత్యం వారి పోరాటం...
మహాభారత యుద్ధాన్ని తలపిస్తుంది...

వారి ఎదచిత్తములోని...

సంతోషాలు ఎప్పుడూ...
బాధలు అనే కత్తుల వేటకు
తెగిపడుతుంటాయి

వారు లేకుంటే రోగగ్రస్త ప్రపంచమే
దర్శనమిస్తుంది
చెత్తను ఎత్తి....ఎత్తి
వారి చేతికున్న జీవిత రేఖలన్నీ
అరిగిపోయి దర్శనమిస్తాయి
స్వచ్ఛ సేవకులై నగరాల వీధులన్నింటినీ
పౌడరద్దినట్లు ముస్తాబు చేస్తారు

మురికి కంపుల వాసనలతో
బుక్కెడు బువ్వ కూడా
వారి ఉదరాన్ని చేరదు
గంజి మెతుకులకు కూడా
గతిలేని జీవితాన్ని గడుపుతారు
వారు సిపాయిలు కాదు
మనందరం నడిచే దారుల్ని
శుభ్రపరిచే సిపాయిలు

- అశోక్‌ గోనె
94413 17361