ఒక మిత్రుణ్ణి కలవడానికి పోతాము. కొద్దిగా నస కేసు అని ముందే తెలుసు. అయినా ఫ్రెండ్ కదా అన్న ఒకే ఒక్క సెంటిమెంటుతో కలుస్తాం. అలా అతణ్ణి కలిసొచ్చాక మిగతా వాళ్ళు అడుగుతారు ఏమి చెప్పాడని. అబ్బా సినిమా చూపించాడురా బాబూ అని మొదలు పెడతాం. ఇంతకు ముందు చుక్కలు చూపించాడురా అనేవాళ్ళు. సినిమా చూపించాడురా అని తరువాత మార్చారు. ఇలా డైలాగులు మారుతుండడం, కొత్తవి రావడం. అవీ సినిమాల నుండి తీసుకున్నవే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. అలా సినిమా మన జీవితాల నుండి విడదీయలేని మీడియాగా మారిపోయింది.
సినిమా అంటే చిత్రం. అది బహు విచిత్రం. చట్టానికి కళ్ళు లేవు అన్న పేరుతో ఒకరు తీస్తే చట్టానికి వేయి కళ్ళు అని ఇంకొకరు తీస్తారు. ఒకాయన గుళ్ళూ గోపురాలపై సినిమాలు తీస్తే ఇంకొకాయన గూండాలు మాఫియాలపై తీస్తాడు. ఏ కొద్ది మందో ప్రజల కష్టాలను చూపించే సినిమాలు తీస్తారు. ప్రజలు నేర్చుకోవలసిన ఆదర్శాలను ఇంకా తక్కువమంది తీస్తారు. ఇక సైన్సును ఆసరాగా చేసుకొని అదే సైన్సుకు వ్యతిరేకంగా మూఢ నమ్మకాలను సినిమాలుగా తీసే వాళ్ళూ ఉన్నారు. ఇలా సినిమా ఎన్నో అవతారాల్లో కనిపిస్తుంది. ఇక అన్నింటిలోనూ కొత్త తరం వచ్చినట్టే సినిమాలోనూ వచ్చి ఇప్పుడు షార్టు ఫిల్ములు తీస్తున్నారు. సినిమా అంటే రెండున్నర లేదా మూడు గంటలు ఉండాలన్న రూల్ లేదిప్పుడు. కథను బట్టి ఉంటుంది.
సినిమా చుట్టూ ఎంత సినిమా నడుస్తుందో ఈ మధ్య తెలుస్తోంది. రోజుకో కామెంటు. రోజుకో వార్త. రాజకీయాలను సినిమాగా తీసే రోజులు పోయి సినిమానే రాజకీయమైందని ఇప్పుడు చర్చ నడుస్తోంది. సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ కొత్త కాదు. వచ్చారు. నిరూపించారు సినిమా పవరేంటో. ఆ తరువాత ఆటుపోట్లు తిన్నారు. అది వేరే సంగతి. సినిమా టికెట్ల ధరలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అది కూడా సినిమా వల్లే రక్తి కడుతోంది. ప్రజల నిత్యావసరాల రేట్లు ముందు తగ్గించండి. తరువాత సినిమా రేట్లు తగ్గించొచ్చు అని ఒకరు. అసలు సినిమా కూడా నిత్యావసరమే అని ఒకరు. ఇలా వాదాలు ప్రతివాదాలు వినిపిస్తున్నాయి. ఏది మాట్లాడినా సంచలనంగా మాట్లాడే వాళ్లకు మహా మహా చాన్సు దొరికిందిప్పుడు. అసలు సినిమా నుండి వచ్చినవారే తరువాత అదే సినిమా రంగానికి అన్యాయం చేశారని, ఎన్నో కొత్త రూల్సు పెట్టి దాన్ని దెబ్బ తీశారని సినీ జనం చెబుతుంటారు. అదేం కాదు. వాళ్లకు ఇవ్వవలసిన రాయితీలు ఇస్తున్నాం. ఇంకెన్ని ఇవ్వాలి అని వారికి సమాధానాలు కూడా వచ్చేశాయి. కాబట్టి బయటివాళ్ళ నుండి కానీ, సినిమా నుండే వచ్చిన వాళ్ళ నుండి కానీ కొన్ని పరిస్థితులను సినిమా ఎదుర్కోవడం మామూలే.
కరోనా కోరల్లో పడ్డ రంగాల్లో సహజంగానే సినిమా ఉంది. అసలు కరోనాకు ముందు, కరోనా తరువాత అని చెప్పుకునే రోజులు వచ్చాయి. ఇంకా కరోనా మూడో దశ ఒమిక్రాన్ రూపంలో ఉండనే ఉంది. అది పోతూ పోతూ తన ప్రతాపాన్ని ఎలా చూపిస్తుందో అన్న భయం కూడా సినీ జనుల్లో ఉంది. జీవులు బతికి బట్ట కట్టాలంటే మార్పులు చేసుకోక తప్పదని డార్విన్ మహాశయుడు ఎప్పుడో చెప్పాడు. అందుకే సినిమా తాను వెలిగిపోయిన థియేటర్లను వదిలేసి డైరెక్టుగా చూసే వాళ్ళ ఇళ్లకే టీవీల ద్వారా వచ్చేసింది. ఆహార పదార్థాలను చేరవేసే సంస్థల్లాగే డైరెక్టు సినిమాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోయే కార్పొరేట్లు వచ్చేశారు. డబ్బు డబ్బును సంపాదిస్తుంది అన్న సూత్రం ప్రకారం అలా సంపాదించే రంగాల్లో సినిమా కూడా ఎప్పటి నుండో ఉంది, ఇకపై ఉంటుంది కూడా. రూపాలు మారొచ్చు అంతే తేడా, మిగతాదంతా సేమ్ తో సేమ్.
ఒక సినిమాలో ఓ కమెడియన్ చెబుతుంటాడు. ఇంట్లో తండ్రికి క్యాన్సర్, తల్లికి టీబీ, తమ్ముడికి బ్రెయిన్ ట్యూమర్...ఇలా ఇంకొకరికి వేరే జబ్బు. ఇదేంటి ఒకే ఇంట్లో ఇన్ని రోగాలంటే వాటినే సినిమా కష్టాలంటారని చెబుతాడు. అలా సినిమాలో చూపించే కష్టాలని జోకుగా చెబుతాడు. అలాంటి సినిమాకి ఎన్ని కష్టాలచ్చాయో ఇప్పుడు. అన్ని కష్టాలచ్చినా ఎంతో కష్టపడి సాగుతోంది సినిమా. కష్టాలు సినిమాలకు గాక ఇంకెవరికి వస్తాయి అని కొత్తగా అనుకోవాలి.
- జంధ్యాల రఘుబాబు
సెల్ : 9849753298










