Jan 01,2021 08:46

సినీ నటుడు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడంలేదన్న వార్తకు మీడియాలో గణనీయమైన చోటు దక్కింది. 'అసలు రాజకీయ పార్టీ కూడా పెట్టకముందే నిష్క్రమించడం రజనీకాంత్‌కే సాధ్యం' అన్న క్లిప్పింగ్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినీ నటులకు సంబంధించిన పబ్లిసిటీ మెండుగా ఉండడం సర్వ సాధారణం. రాజకీయాల్లోకి రావడం, లేదా వెనక్కు పోవడం వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. రజనీకాంత్‌కూ అంతే! అయితే, సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే అప్రతిహతంగా దూసుకుపోతారంటూ కొందరు ఎన్‌టిఆర్‌, ఎమ్‌జిఆర్‌, కరుణానిధి, జయలలిత తదితర పేర్లు చకచకా చెబుతుంటారు కానీ అది అందరు కళాకారులకు, ఎల్లవేళలకు వర్తించే విషయం కాదు. ఆ మాటకొస్తే గొప్ప విజయాలు సాధించిన వారు ఎదురుదెబ్బలు కూడా తిన్నారు. కాబట్టి ఏ నేపథ్యం నుండి రాజకీయాల్లోకి వచ్చినా ఆయా వ్యక్తులు నాయకత్వం వహించిన పార్టీ చేపట్టిన రాజకీయ విధానం, ఆనాటి సామాజికార్థిక నేపథ్యం కీలకాంశాలన్నది విస్మరించరాదు.


ప్రాంతీయ పార్టీల చరిత్ర పరిశీలిస్తే దాదాపు అవన్నీ కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని, ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా పుట్టినవే. అకాలీదళ్‌, డిఎంకె, తెలుగు దేశం... ఇలా ఏ పార్టీదైనా అలాంటి చరిత్రే! కేంద్ర ప్రభుత్వ పెత్తనానికి వ్యతిరేకంగా తమిళనాట ద్రవిడ ఉద్యమ నేపథ్యాన్ని, పెరియార్‌ బోధనల్ని పునాదిగా చేసుకొని డిఎంకె ప్రజల ఆదరాభిమానాలు పొందింది. తమిళ భాష, భౌగోళిక గుర్తింపు వంటి అంశాలపై గట్టిగా నిలిచింది. అన్నాదురై, కరుణానిధి, ఎంజిఆర్‌ చరిత్ర ఇదే. తెలుగునాట ఎన్‌టి రామారావు కూడా ఆంధ్రుల్లో పెల్లుబికిన కాంగ్రెస్‌ వ్యతిరేకత ఆధారంగానే అనతి కాలంలో అధికార పీఠాన్ని అధిష్టించారు. రైతుకు గిట్టుబాటు ధర కోసం 1981లో అఖిలపక్ష రైతు ఉద్యమంలో ఉద్భవించిన ప్రజా వెల్లువ తెలుగు దేశం పార్టీకి రాజకీయ భూమికగా రూపొందింది. ఆ ప్రజాభిమానం కొనసాగిన కారణంగానే గవర్నర్‌ ద్వారా పదవి నుండి తొలగించిన ఎన్‌టి రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా చేయవలసిన అగత్యం కాంగ్రెస్‌ పాలకులకు వచ్చింది. ప్రాంతీయ పార్టీలు, వాటి నాయకుల విజయగాథలే గాక కొన్ని వైఫల్యాలూ ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు, గణనీయమైన ఓట్ల సాధన నుండి అంతర్ధానం వరకూ తెలుగు ప్రజలందరికీ తెలిసిందే! ఆ పార్టీతోనే రాజకీయ ప్రవేశం చేసిన పవన్‌ కల్యాణ్‌ 2004లో టిడిపి, బిజెపిలతో జట్టు కట్టి, 2019 ఎన్నికల్లో టిడిపి, వైసిపి, బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఉంటానని వామపక్షాలతో చెలిమి చేశారు. 'పాచిపోయిన లడ్డూలిచ్చింద'ని బిజెపిని విమర్శించిన ఆయన, తరువాత అదే పార్టీతో చేతులు కలపడం మరో చిత్రమైన పరిణామం.


'రాజకీయాల్లోకి వస్తా.. వస్తా...' అంటూ రజనీకాంత్‌ చాలా ఏళ్లుగా అభిమానుల్ని ఊరిస్తున్నారు. రాజకీయ పార్టీ పెడతానని ఇటీవల ప్రకటించి అనారోగ్యానికి గరయిన నేపథ్యంలో రాజకీయాల్లోకి రాలేనంటూ హఠాత్తుగా వెల్లడించారు. అయితే, ఒక నటుడి అభిమానులందరూ ఆటోమేటిక్‌గా రాజకీయ అభిమానులు అయిపోరు. ఆనాటి రాజకీయ వాతావరణంలో ప్రజానుకూల వైఖరి చేపట్టిన వారికి మాత్రమే సినీగ్లామర్‌ తోడవుతుంది. సినీ కళాకారుల రాజకీయ ఉత్థాన పతనాల్లో ఈ అంశం దండలో దారం మాదిరి ఉండడాన్ని గమనించవచ్చు. అనేకమంది నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా, మంత్రులుగానూ పదవులు పొందారు. కానీ, సంబంధిత పార్టీ లేదా ప్రభుత్వాధినేత కనుసన్నల్లో మెలగడమేతప్ప వారికి స్వయంప్రకాశకత రాలేదన్న విషయం మరువరాదు. ఈ అంశాలన్నిటినీ పరిశీలిస్తే రజనీకాంత్‌ పేర్కొన్న 'ఆధ్యాత్మిక రాజకీయాలు' అక్కరకు వచ్చేవి కాదని ఎవరికైనా బోధపడుతుంది. పైపెచ్చు ప్రాంతీయ పార్టీల పుట్టుకలో కీలకమైన కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కుల కోసం పోరాడే అంశం లేకుండా రజనీకాంత్‌ నెగ్గుకురావడం ఆచరణ సాధ్యం కాదు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి అంటున్న బిజెపికి వ్యతిరేకంగా తమిళ ప్రజలు రగిలిపోతున్న సమయంలో ఆ పార్టీతో చెలిమి చేసే రాజకీయాలను వారు స్వీకరించడం జరగని పని. రజనీకాంత్‌ 'రాజకీయ నిష్క్రమణ' వెనుక తమ సొంత కారణాలతోపాటు ఇలాంటివి కూడా ఉండొచ్చు.