తెలుగు నటీనటుల వేదిక 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) ఎన్నికలలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓడిపోయి, మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. గెలిచిన విష్ణును అభినందించడంతో ఆగక ఓడినవారిని జాతి వ్యతిరేక శక్తులుగా, టుక్డే టుక్డే గ్యాంగ్‌గా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు తన ట్వీట్లో తిట్టిపోశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ తీర్పు కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారని, వారిని ఓడించడం గొప్ప విషయమని ఆనందపడిపోయారు. విజయం సాధించిన విష్ణు, ఆయన తండ్రి-ప్రముఖ నటుడు నిర్మాత మోహన్‌బాబు తమ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీతో వున్న ప్రత్యక్ష సంబంధాన్ని గురించి ప్రచార సమయంలోనే చెప్పారు. ప్రకాశ్ రాజ్ వివిధ సందర్భాలలో బిజెపి మత రాజకీయాలను మరీ ముఖ్యంగా మోడీ హయాంలో ఏకపక్ష ధోరణులను, భావప్రకటనా స్వేచ్ఛపై దాడులను ఖండించిన సంగతి తెలిసిందే.
బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యను నిరసించడంలో ఆయన ముందు నిలిచారు. ఈ కారణంగా సంఘ పరివార్ ఆయనపై చాలా సార్లు విమర్శలతో దాడి చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగానూ పోటీ చేశారు. 'మా' అధ్యక్షుడుగా ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తారని మిగిలిన వారికన్నా ముందే ప్రకటించారు. ఆయనకు మాజీ అధ్యక్షుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు మద్దతు ప్రకటించారు. ఆయన రంగంలోకి వస్తారనగానే లోకల్ నాన్‌లోకల్ వివాదం ప్రధానంగా వినిపించింది. మీడియాలో చాలామంది నాన్‌లోకల్ కు నాయకత్వం ఇవ్వడమేమిటని వాదించారు. చిరంజీవి మరో సోదరుడు, జనసేన అధినేత (ఆ విధంగా బిజెపి స్నేహితుడు) కూడా అయిన పవన్ కళ్యాణ్ నాన్‌లోకల్ నినాదాన్ని తోసిపుచ్చారు. ఆ మాటన్నది మేము కాదని పైకి చెబుతున్నా ప్రకాశ్‌రాజ్ పౖౖె లోపాయికారిగా గట్టిగా నడిచింది. ఈ దశలో మంచు విష్ణు మరో ప్యానల్‌గా పోటీ చేస్తానని ముందుకొచ్చారు. మొదట్లో వేరుుగా పోటీ ప్రకటించిన పలువురు ప్రకాశ్ రాజ్ ప్యానల్లో చేరిపోవడంతో ఈ రెండు శిబిరాల మధ్యనే పోటీ హోరాహోరీగా సాగింది.
గత మూడు పర్యాయాలుగా మా ఎన్నికలు పోటాపోటీగా అవుతున్న మాట నిజమే అయినా ఈసారి మరీ ఆరోపణలు, ఆవేశాలు శ్రుతి మించాయి. దూషణలు, ఆరోపణలు కూడా చెలరేగాయి. గత ఎన్నికల్లో నరేష్ విజయం సాధించిన తర్వాత 'మా' సరిగా పని చేయలేదనే భావం బలంగా వుండింది. పని చేయించడానికి, పద్ధతులు పాటించడానికి ఒక క్రమశిక్షణా కమిటీని కూడా నియమించారు. ఈ పూర్వరంగంలో నరేష్ మంచు విష్ణు శిబిరంలో ప్రధాన సంధానకర్తగా ప్రచారం సాగించడం వాదవివాదాలు పెంచింది. ఆన్లైన్ టికెట్ల సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వేడిని ఇంకా పెంచాయి. టిడిపి ఎంఎల్ఎ, ప్రముఖ నటుడు బాలకృష్ణ విష్ణును బలపర్చగా వైసీపీ అనుకూలురు కూడా అటే వున్నారన్న వాతావరణం కనిపించింది. జగన్‌కు ఆ కుటుంబంతో వున్న బంధుత్వం రీత్యా కూడా పలువురు ఆ అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ దశలో ఎ.పి మంత్రి పేర్ని నాని 'మా' ఎన్నికలతో తమకు ఏ సంబంధం లేదని ప్రత్యేకంగా ప్రకటించినా ఈ అభిప్రాయం పెద్దగా తొలగలేదు.
మామూలుగా చిత్ర పరిశ్రమలో విభిన్న రాజకీయ పార్టీలను అభిమానించేవారు వున్నా కళామతల్లి బిడ్డలుగా తామంతా ఒకటేనని చెప్పడం జరుగుతుంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ, జాతీయ పార్టీల ప్రభావం కూడా మారింది. రాజకీయంగా మోహన్‌బాబు మొదట టిడిపి ఎం.పి గా వుండి తర్వాత చంద్రబాబు నాయుడుతో విభేదించి జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష వెలిబుచ్చుతూ వచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టుకుని తర్వాత కాంగ్రెస్‌లో లీనమై ప్రస్తుతం నటనపై కేంద్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాగబాబు జనసేనలో వున్నారు. నరేష్ బిజెపిలో చేరగా కృష్ణంరాజు గతంలో వాజ్‌పేయి హయాంలో మంత్రిగా పనిచేశారు. చిత్ర పరిశ్రమలో రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలతో పాటు వ్యక్తిగతంగానూ కొన్ని ప్రముఖ కుటుంబాల పరంగానూ వైరుధ్యాలు వుండనే వుంటాయి. వేర్వేరు శిబిరాలూ నడుస్తుంటాయి. 2007 జనవరి 28న తెలుగు సినిమా వజ్రోత్సవ సంరంభంలో మోహన్‌బాబుకు సెలబ్రటీ పురస్కారం, చిరంజీవికి లెజెండ్ సత్కారం చేసిన తర్వాత ఈ తేడాలేమిటన్న దానిపై బహిరంగంగానే వైరుధ్యాలు ప్రజ్వరిల్లాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి, మోహన్‌బాబు స్నేహంగా మాట్లాడుతున్నారు. ఏకగ్రీవం కోసం తనకు కనీసం ఫోన్ అయినా వస్తుందనుకుంటే రాలేదు గనక విష్ణు పోటీలో వున్నారని మోహన్‌బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అనేక ఆరోపణలు, అందులో పోస్టల్ బ్యాలెట్లు తెప్పించడం వంటి వాటిపై దుమారాలు, పరస్పర విమర్శల నేపథ్యంలో ఎన్నికలు జరిగి విష్ణు ప్యానల్ విజయం సాధించింది. ఆ తర్వాత బండి సంజయ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ నాన్‌లోకల్ వాదనలకు స్పందిస్తూ ప్రకాశ్ రాజ్ 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నాన్‌లోకల్స్ పోటీ చేయడానికి వీలు లేకుండా నిబంధనలు సవరిస్తామని మంచు విష్ణు అన్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వాదం సంకుచితత్వంలో కొట్టుమిట్టాడుతున్న 'మా'లో తాను వుండదలచలేదని మాజీ అధ్యక్షుడు చిరంజీవి సోదరుడు నాగబాబు అంతకు ముందే ప్రకటించారు. వీరి రాజీనామాలు ఉపసంహరించుకోవాలని గెలిచిన విష్ణు కోరారు గాని నాన్‌లోకల్ అంశంపై హామీకి సిద్ధం కాలేదు. జనరల్ బాడీలో చర్చించవలసిందేగాని ముందే తాను ఎలా చెప్పగలనని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.
ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది కూడా తర్వాత రాజీనామాలు ప్రకటించారు. వేర్వేరు ప్యానళ్ల నుంచి గెలవడం వల్లనే తాను పని చేయలేకపోయానని గతంలో నరేష్ అన్నారని, ఫలితాల తర్వాత విష్ణు కూడా ఆ తరహాలో మాట్లాడారు గనక ఆయనకు స్వేచ్ఛనివ్వడానికే తాము తప్పుకుంటున్నామని ఆయన వాగ్ధానాల అమలుకు పదవీ కాలంలో జరిగే కృషిని చూస్తుంటామన్నారు. నాన్‌లోకల్ సభ్యులకు కూడా పోటీ చేసే హక్కు వుంటుందని మాట ఇస్తే తన రాజీనామా వెనక్కు తీసుకుంటానని ప్రకాశ్‌రాజ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతోపాటే ఓట్ల లెక్కింపు అవకతవకలూ, పోలింగ్ నాడు తమపై దౌర్జన్యం చేశారనే ఆరోపణలు కూడా చేశారు. ఇదంతా ఓటమి తట్టుకోలేక చేస్తున్నారని ఇవతలివారు కొట్టిపారేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కృష్ణమోహన్ కూడా ఓటమి కారణంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. 'మా' రెండుగా చీలిపోతుందని కూడా కథనాలు వచ్చినా ఆ ఆలోచన లేదని ప్రకాశ్‌రాజ్ వర్గం ప్రకటించడంతో ప్రస్తుతానికి అలాంటిది జరగలేదు. విష్ణు ప్రమాణ స్వీకారం చేయగా నరేష్ సవాళ్లు విసిరారు. రాజకీయంగా చూస్తే ఈ ఫలితాల తర్వాత బిజెపి నాయకులు, వైసీపీ అనుకూల సోషల్ మీడియా చాలా సంతోషం వ్యక్తం చేస్తుండగా టిడిపి, టిఆర్ఎస్ అనుకూలురు పైకి తక్కువగానే స్పందిస్తున్నారు. రెండేళ్లు మూడేళ్లు వుండే పదవుల కోసం ఇంతగా తగాదాలు పడటం వల్ల పలచన అవుతామని ఈ వాతావరణం ఏర్పడటానికి మూలాలు ఏమిటో వెతకాలని... ఫలితాలు వస్తుండగానే చిరంజీవి అన్నారు. దాసరి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దగా అంటూ లేరని మోహన్‌బాబు అనగా చిరంజీవి ఆ పాత్ర నిర్వహిస్తున్నారని ఆయన సమకాలీకుడైన మరో నటుడు అన్నారు. మోహన్‌బాబు పెద్దగా వుండాలని ఈ ఫలితాల తర్వాత నరేష్ అంటుంటే చిరంజీవికి ఆ భావమే లేదని అందరితో కలసి పనిచేయడం మేలు చేయడం ఆయన విధానమని నాగబాబు వ్యాఖ్య. అయితే చిరంజీవి తనను తప్పుకోమన్నారని విష్ణు వెల్లడించారు. బిజెపి మిత్రులైన మెగా సోదరులు ఇద్దరు ప్రకాశ్‌రాజ్‌ను సమర్థించడమేమిటని ఆ పార్టీ ప్రతినిధి ఒకరు అంటే నేను రాజకీయంగా ప్రకాశ్ రాజ్‌కు సరిపడను కదా అని పవన్ కళ్యాణ్ పోలింగ్ సందర్భంలోనే అన్నారు. మొత్తంపైన బిజెపి వారు చాలామంది మంచు విష్ణు శిబిరంలో ప్రముఖంగా కనిపించారు. బండి సంజరు వివాదాస్పద వ్యాఖ్యలు సూటిగానే జరిగిన పరిణామక్రమానికి అద్దం పట్టాయి.
ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారి సామూహిక రాజీనామాలు ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా నిలిచాయి. పరిశ్రమ ఐక్యత, కళాకారుల సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని పోవడానికి కొత్త అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రధానంగా ముందున్న సమస్య. నాన్‌లోకల్, టుక్డే టుక్డే గ్యాంగ్ వంటి ముద్రలు అందుకు ఆటంకం కాకుండా చూడటం, చాలామంది భావిస్తున్నట్టు సామాజిక రాజకీయ వైరుధ్యాలు, ఆధిపత్య పోరాటాలు అందుకు ఆటంకం కాకుండా ప్రజాస్వామికంగా వ్యవహరించడం అవసరం. రాజీనామా చేసిన వారితో మాట్లాడి ఆరోగ్యకరమైన పరిష్కారాలు కనుగొనేందుకు ఒక బృందాన్ని నియమించి చర్చలు జరపవచ్చు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకుంటున్న తరుణంలో కళాకారులను, సినీ కార్మికులను తీవ్ర సమస్యలు వెన్నాడుతున్న తరుణంలో ఎంత వేగంగా ఈ పని జరిగితే అంత మంచిది. కుల, మత, ప్రాంతీయ ధోరణులు అసహన రాజకీయాలు తెలుగుచిత్ర పరిశ్రమ విశాల వారసత్వాన్ని దెబ్బ తీయకుండా కాపాడుకోవాల్సి వుంది. అందుకు హాని చేసే అవకాశవాదాలను, విద్వేషాలు పెంచే వివాదాస్పద పోకడలను కూడా దూరం చేయాల్సి వుంటుంది.
తె. ర










