Mar 13,2023 22:54

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
        కూరగాయల వ్యాపారి వద్ద పని చేస్తూ, ఆ వ్యాపారినే మోసం చేయాలని చూసిన గుమస్తా చివరకు పోలీసులకు చిక్కాడు. ఇటు పోలీసులను, అటు వ్యాపారిని ముప్పుతిప్పలు పెట్టిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సిఐ బి.వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడేనికి చెందిన విజయ గణపతి ట్రేడర్స్‌కు చెందిన శివశంకర్‌ తెలంగాణలోని పలుప్రాంతాల్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ప్రతీవారం కూరగాయలు పంపి డబ్బు వసూలుకు గుమస్తాలను పంపేవాడు. దానిలోభాగంగా గుమస్తాగా పనిచేస్తున్న దుర్గారావును, మరో వ్యక్తి రాజశేఖర్‌ను డబ్బు వసూలుకు పంపాడు. వారు వ్యాపారుల నుంచి లక్షా 20 వేలు వసూలు చేసుకుని మోటార్‌ సైకిల్‌పై తిరిగి వస్తున్నారు. ఈ తరుణంలో దుర్గారావు అత్యాశకు పోయి డబ్బు కాజేయాలని పథకం రచించాడు. శవశంకర్‌ వద్ద గుమస్తాగా చేస్తూ మానేసిన దుర్గారావు మిత్రుడు రోహిత్‌, అతని మిత్రులు మల్లాది సునీల్‌, మన్యాం అరవింద్‌ సహాయంతో మండలంలోని రమణక్కపేట సమీపంలో కారులో వచ్చి పోలీసులమని చెప్పి తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న నగదు లాక్కొని పరారయ్యేలా ఏర్పాట్లు చేశాడు. అనుకున్నట్లే వారు కారులో వచ్చి నగదుతో పరారయ్యారు. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వేరే వ్యక్తి రాజశేఖర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం యజమానికి సమాచారం అందించాడు. ఈ తరుణంలో సోమవారం పాలాచర్ల, రాజవరం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో నిందితులు పట్టుబడ్డారు. వారి వద్దనుంచి మహీంద్ర కారును, బొమ్మ తుపాకీ, ద్విచక్ర వాహనం, లక్షా ఇరవై వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నలుగురు వ్యక్తులతో సహా స్వాధీన సొత్తును కోర్టులో హాజరు పరచనునట్లు తెలిపారు.