Mar 15,2023 21:33

ప్రజాశక్తి - ముసునూరు
             సింజెంటా మొక్కజొన్న కంపెనీ బాధిత రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నర్సింహా అన్నారు. బుధవారం మండలంలోని కాట్రేనిపాడు రెవెన్యూ పరిధిలో సుమారు 230 ఎకరాల్లో సింజెంటా మొక్కజొన్న విత్తనం నాటగా అవి పూర్తిస్థాయిలో గింజలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలిసి రైతుసంఘం నేతలు బుధవారం ఆ మొక్కజొన్న పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సింజెంటా మొక్కజొన్న కంపెనీ ఎకరానికి మూడున్నర టన్నుల నుంచి ఐదు టన్నుల వరకూ దిగుబడి వస్తుందని ఆశ చూపి విత్తనాలిచ్చారని తెలిపారు. కౌలు కాకుండానే ఎకరానికి సుమారు రూ.60 నుంచి రూ.70 వేలు వరకూ పెట్టుబడి పెట్టామన్నారు. ప్రస్తుతం విరుపుడు దశలో ఒకటిన్నర నుండి రెండు టన్నులు మాత్రమే దిగుబడి రావడంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. దీనిపై రైతులంతా కలిసి రైతుసంఘం ఆధ్వర్యాన కాట్రేనిపాడులో ధర్నా నిర్వహించారు. అనంతరం మండల కేంద్రం ముసునూరు చేరుకుని మండల వ్యవసాయాధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. సింజెంటా కంపెనీ, సీడ్‌ ఆర్గనైజర్లతో మాట్లాడి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పిల్లి మురళీ, రైతులు సొంగా రమేష్‌, సొంగా అశోక్‌బాబు, సొంగా యోబు, గద్ధల రంగారావు, కలపాల నెహ్రు, డి.పండు, సొంగా ప్రకాశరావు, జి.విజరుకుమార్‌, జి.బక్కయ్య, సొంగా నాగేశ్వరరావు, సొంగా ఆనందరావు, సొంగా జయరాజు, ఎస్‌.రాజు కోరారు.
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌
పెదవేగి: దిగుబడి రాక నష్టపోతున్న సీడ్‌, కమర్షియల్‌ మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని పెదవేగి, కూచింపూడి గ్రామాల్లో బుధవారం ఆ సంఘం నేతలు పర్యటించి సీడ్‌, కమర్షియల్‌ మొక్కజొన్న పంటను పరిశీలించారు. పంట దిగుబడి, పెట్టుబడి ఖర్చుల వివరాలను రైతులను అడిగి సేకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సీడ్‌, కమర్షియల్‌ మొక్కజొన్న పంట రైతుల చేతికొచ్చిందని చెప్పారు. గతేడాది కంటే ఈ సంవత్సరం వాతావరణ మార్పులు, తెగుళ్లు, ఇతర కారణాలతో దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఎరువులు, పురుగుమందుల ధరలతో ఎకరా మొక్కజొన్న సాగుకు రూ.50 వేలు వరకు పెట్టుబడి ఖర్చవుతుందని అన్నారు. ఎకరా కౌలు రూ.30 వేలకుపైగా ఉందన్నారు. కౌలుతో కలుపుకుని ఎకరాకు రూ.80 వేలకుపైగానే పెట్టుబడి అవుతుందని చెప్పారు. దిగుబడి మాత్రం మూడు టన్నులకు మించి రావడం లేదన్నారు. సీడ్‌ కంపెనీలు టన్నుకు రూ.25 వేలు ఇస్తున్నాయని, ఫలితంగా మొక్కజొన్న కౌలురైతులు నష్టపోతున్నారని తెలిపారు. సీడ్‌ కంపెనీలు రైతులను మోసగించకుండా పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. కమర్షియల్‌ మొక్కజొన్న సాగు రైతులు కూడా నష్టపోతున్నారని చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు అదనంగా ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కె.నాగేశ్వరరావు, పలువురు మొక్కజొన్న రైతులు పాల్గొన్నారు.