ప్రజాశక్తి - ఆరిలోవ : సింహాచలం కొండపరిధిలో చినగదిలి నుంచి జ్ఞానానంద ఆశ్రమం వరకు రూ.5 కోట్ల ఎంపీ నిధులతో రక్షణ గోడ నిర్మాణానికి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శుక్రవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, సింహాచలేసుని భూములతోపాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉండే రక్షణగోడ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముందుకు రావడం అఅభినందనీయమన్నారు. ఆక్రమణలకు గురవుతున్న దేవస్థానం భూములను, దేవాలయ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సింహాచలం పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. పంచగ్రామాల భూసమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎంపి విజయసాయిరెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేవస్థాన భూముల పరిరక్షణకు ఎంపి నిధులతో పాటు మరిన్ని నిధులు సేకరించి కొండచుట్టూ రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి అమరనాథ్‌్, ఎంపి సత్యవతి, విఎంఆర్‌డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మశ్రీ, ఆదీప్‌రాజు, టి.నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు.










