అసంపూర్తి బిఆర్‌టిఎస్ రోడ్డు వల్లే అవస్థలు
ఇరుకురోడ్డులో ఎదురెదురుగా వచ్చిన
వాహనాలతో ఇరుక్కుపోయిన ప్రజలు
ప్రజాశక్తి- సింహాచలం: సింహాచలం ప్రాంతంలో ప్రధానరోడ్డులో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు నానా ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం సెలవు కావడంతో అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులతోపాటు కార్తీకమాసం రెండో ఆదివారం కావడంతో పిక్నిక్‌లకు వచ్చే వారితో తీవ్రమైన రద్దీనెలకొంది. భారీ ఎత్తున బస్సులు, కార్లు, బైక్‌లతోపాటు స్థానికంగా తిరిగే ఆటోలు, సిటీబస్సులు, ఇతర వాహనాలతో సందర్శకులు, భక్తులు తరలిరావడంతో రోడ్డుపొడుగునా వాహనాలు నిలిచి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కొంతకాలంగా బిఆర్‌టిఎస్ రోడ్డు పనులు పెండింగ్‌లోనే నిలిచిపోవడంతో, అడవివరం నుంచి సింహాచలం అటుఇటుగా కొద్దిదూరం రోడ్డు ఇరుకుగా ఉండడం, అదే సమయంలో పెద్దఎత్తున ఎదురెరుగా వాహనాలు రావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. సుమారుమూడు గంటలపాటు వాహనచక్రబంధంలో ఈ మార్గమంతా ఇరుక్కుపోవడంతో అటుగా ప్రయాణించే భక్తులతో పాటు స్థానికులు, వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించి మూడు గంటల తర్వాత ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఇకనైనా అధికారులు స్పందించి ఆడవివరం నుంచి గోశాల వరకు అసంపూర్తిగా ఉన్న మిగిలిన బిఆర్‌టిఎస్ రోడ్డును కూడా త్వరిగగతిన పూర్తిచేసేందకు చర్యలు చేపట్టడం ద్వారా ఈ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు విముక్తి కల్పించాలని అప్పన్న భక్తులతోపాటు స్థానికులు వాహనదారులు కోరుతున్నారు.










