Apr 08,2023 23:56

బాధిత కుటుంబ సభ్యులతో కలిసి విలేకర్లతో మాట్లాడుతున్న వెంకన్న

ప్రజాశక్తి- అనకాపల్లి జిల్లా
దేవరాపల్లి మండల కేంద్రానికి చెందిన జామి సింహాచలం నాయుడు అనుమానాస్పద మృతి కేసును మొదటి నుంచి అనుమానం కలిగించే విధంగా దర్యాప్తు జరుగుతుందని, అందువల్ల దీనిని సిబిసిఐడికి అప్పగించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న డిమాండ్‌ చేశారు. శనివారం రైవాడ అతిథి గృహం వద్ద మృతుని కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్న విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింహాచలం నాయుడు మృతికి కారకులు ఎవరో, అనుమానితుడు ఎక్కడ రెక్కీ నిర్వహించాడో ఇప్పటికే అనేక మంది పూసగుచ్చినట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని, అయినా ఎవరి దగ్గరైనా సాక్షాలు ఉంటే తీసుకురమ్మని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉన్నాయన్నారు. నాయుడు మృతికి ప్రేరేపించిన వ్యక్తులపై కేసు పెట్టడానికి అవకాశం ఉన్నా పోలీసులు ఉదారంగా వ్యవహరించి కేసు నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టులో చిన్న పేగులో విషం ఉన్నట్లు, చాతి ఎడమ వైపు ఎవరో అమ్ము అని పేరుతో పచ్చబొట్టు ఉన్నట్లు ఉందని, పూర్తిస్థాయిలో పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కేసు విషయం 25 మంది స్టేట్‌మెంట్లు కట్టామని, ఇంకా ఎవరైనా ప్రత్యక్షంగా చూసినవారు ఉంటే స్టేట్మెంట్‌ తీసుకుంటామని పోలీసులు చెప్పడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. ఆ తల్లి ఇంకా సాక్షులను ఎక్కడినుండి తీసుకురాగలదని వెంకన్న ప్రశ్నించారు. త్వరలో మృతిని తల్లి సింహాచలమ్మ పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరాహారదీక్ష చేసుకోవడానికి అనుమతి కోరుతుందని, పోలీసులు అనుమతి ఇచ్చిన వెంటనే సింహాచలమ్మ మద్దతుగా దేవరాపల్లి ప్రజలు నిరాహార దీక్షలో పాల్గొంటారని తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ప్రజానీకం, ప్రజాసంఘాలు, సంయుక్తంగా పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవిరెడ్డి దేముడు నాయుడు (సింహ), బండారు అప్పలనాయుడు, కడారి రామకృష్ణ, జామి శ్రీను, చొక్కాకుల సన్యాసినాయుడు, చొక్కాకుల సింహాద్రి, పాచిలి వెంకటరావు పాల్గొన్నారు.