Aug 17,2022 23:19

సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విశాఖ మేయర్‌, కార్పొరేటర్ల బృందం

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : అధ్యయన యాత్రలో భాగంగా సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌ను మేయర్‌, కార్పొరేటర్ల బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా మేయర్‌ బృందానికి ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్‌ భరద్వాజ్‌, కమిషనర్‌ ఆశీష్‌ కోహ్లీ, సిమ్లా మేయర్‌ సీనియర్‌ పిఎస్‌ డిఎస్‌ పరమార్‌ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖ నగర మేయర్‌ మాట్లాడుతూ, విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతాలు , సాగర తీర ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ చేయు విధానాన్ని, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) లో భాగంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ తదితర అంశాలపై పవర పాయింట్‌ ప్రజంటేషన్‌ సిమ్లా అధికారులకు చూపించారు. నగరంలో నిషేధిత ప్లాస్టిక్‌ను అంచలంచెలుగా నిర్మూలిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాలైన సహజ సిద్ధమైన అరటి ఆకులు, విస్తరాకులు, వస్త్ర సంచులు, నార సంచులు, కాగితపు గ్లాసులు, ప్లేట్లు, చెక్క స్పూన్స్‌ మొదలైనవి ఉపయోగించమని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, పర్యావరణం, కాలుష్య నివారణ చర్యలలో భాగంగా వారంలో ఒక్క రోజు సోమవారం సొంత వాహనాలను వదిలి ప్రజా రవాణా ద్వారా కార్యాలయాలకు రావడం జరుగుతుందని వివరించామని మేయర్‌ తెలిపారు. సిమ్లాలో పారిశుధ్య నిర్వహణకు వారు తీసుకుంటున్న జాగ్రత్తలు, తదితర అంశాలను సిమ్లా అధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారని మేయర్‌ తెలిపారు. 32 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న సిమ్లా ప్రాంతంలో తాగు నీరు ప్రాజెక్టులు, పట్టణ ప్రణాళిక విభాగాలలోని ప్లాన్లు మంజూరు చేయు విధానం, కొన్ని ప్రాంతాలలో ఫ్రీ వెహికల్‌ జోన్లు పక్కగా అమలు జరుగుతున్నాయని తెలిపారు.