ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులోని అడవితక్కెళ్లపాడు వద్ద నిర్మించిన శిల్పారామాన్ని మంత్రి ఆర్.కె.రోజా శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం 92 వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సభా కార్యక్రమానికి ముందుగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు స్వయంగా గీసిన అబ్దుల్ కలాం పెయింటింగ్‌ను, ఆయనపై రచించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. నాదస్వర విద్వాంసులు పద్మశ్రీ షేక్ మహబూబ్ సుభానీ, షేక్ కాలేషా మహబూబి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కె.చదువుల బాబు, గాయకుడు, జాతీయ జెండా ప్రచారకర్త షేక్ మహబూబ్ సుభానీకి మంత్రి రోజా సన్మానం చేశారు. వివిధ రంగాలకు చెందిన కళాకారులనూ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాచీన కళలు, హస్తకళలను ప్రోత్సహించి వాటిని ప్రజలలోకి తీసుకెళ్ళి వాటి ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో శిల్పారామాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. హస్తకళల ఉత్పత్తుల ప్రాచుర్యం కోసం ఎగ్జిబిషన్లు, మేళాలు నిర్వహించి వాటిని నేరుగా ప్రజలకు అమ్మడానికి ఏర్పాట్లు చేయడం, తద్వారా దళారి వ్యవస్థను అరికట్టి వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను కల్పించి ప్రోత్సహిస్తామని అన్నారు. కనుమరుగవుతున్న కళలను శిల్పారామంలో ప్రదర్శించి వాటికి తగు ఆదరణ కల్పించి, ప్రాచీన కళలు భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ అబ్దుల్ కలాం ప్రతి ఒక్క విద్యార్ది గుండెల్లో గుండె చప్పుడై వుండాలని కోరుకుంటున్నామని, పేద కుటుంబంలో పుట్టి, అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదిగారన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఆహ్లాదం కోసం పార్కులు, శిల్పారామం ఏర్పాటు చేసుకుంటున్నామని, పిల్లలు ఆడుకోవడానికి ఈ శిల్పారామం మంచి ప్రదేశమని, ఇక్కడ ఏర్పాటు చేసిన చెరువులో బోటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్‌రావు, శిల్పారామం సొసైటి సిఇఒ శ్యామ్ సుందర్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సహాయ కార్పొరేషన్ చైర్పర్సన్ ముంతాజ్ పఠాన్, మచిలీపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ మేకతోటి దయాసాగర్, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సజీల పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
నృత్యం చేస్తున్న వారితో మంత్రి రోజా