Feb 13,2023 23:05

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: విద్యార్థులు సిలబస్‌లో లేని పుస్తకాలను పఠనం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవ్‌లో సోమవారం పుస్తక ప్రియుల పాదయాత్ర అనంతరం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మాజీ పార్లమెంట్‌ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. కవులు ఎంతో సామాజిక థృక్పతంతో పాటు ఎంతో ముందు చూపు ఉన్నవారని అన్నారు. కవులు ఎప్పుడో 1960లో రాసిన పుస్తకంలో 2020 తరువాత ఎలా సమాజం ఉంటుందో రాస్తారని అలాగే ఉంటుందని తాను ఈమధ్య అప్పటి పుస్తకం చదివి తెలుసుకున్నానని గుర్తు చేశారు. అంటే కవులు ఎంతో ముందుచూపుతో ఊహించి రాస్తారని కవులు కాలా గొప్పవారని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సబ్జెక్టు పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవడం వలన విజ్ఞానం వస్తుందన్నారు. చదవ గలిగే శక్తి ఉన్నంతవరకు పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశం కోసం, మానవాళి కోసం పుస్తకాలు చదవాల్సిన అవసరం నేడు ఎంతయినా ఉందన్నారు. విజయవాడ పుస్తక మహౌత్సవానికి ఎంతో విశిష్టత ఉందని, ఇక్కడ ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని గత ఐదేళ్లుగా తాను పాల్గొంటున్నానని తెలిపారు. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా పుస్తక ప్రదర్శన నిర్వహించడం ద్వారా అందరికీ విజ్ఞానం అందుతుందన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలు చదువుతున్నారు కాని కేవలం సిలబస్‌ పుస్తకాలు మాత్రమే చదువుతున్నారన్నారు. సిలబస్‌లో లేని పుస్తకాలు ఎంతవరకు చదువుతున్నారని ఆలోచించాలన్నారు. నూటికి 99 శాతం మంది కేవలం సబ్జెక్టు పుస్తకాలు మాత్రమే చదువుతున్నారన్నారు. ఇతర పుస్తకాలు కూడా చదవాలనే అభిరుచి నేటితరం విద్యార్థులకు, ముఖ్యంగా యువతకు కలిగించాలన్నారు. ఆ విధంగా చేయాలంటే ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. అలాగే చాలా మంది పరీక్షలు తప్ప సొంతంగా రాయలేని స్థితి ఉందన్నారు. పుస్తకాలు చదవడం వలన పరీక్షలతో పాటు ఇతరత్రా ఏ అంశాన్ని అయినా సులభంగా రాయగలరని అన్నారు. ముఖ్యంగా చిన్ననాటి నుండి పుస్తకాలు చదవడం అలవాటుగా రావాలన్నారు. పుస్తకాలు చదివే వారికి అల్జీమర్స్‌ తక్కువగా వస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ చదవడంతో పాటు ఇతరులకు కూడా చదివించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కవి, సాహితీవేత్త వాడ్రేపు చినవీరభ్రదుడు, ప్రజానాట్యమండలి సీనియర్‌ నాయకులు ఎన్‌. వెంకటేశ్వర్లు, పాల్గొనగా కార్యక్రమానికి ఎమెస్కో విజయకుమార్‌ అధ్యక్షత వహించగా విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్ష కార్యదర్శిలు వి.మనోహర్‌నాయుడు, కె.లక్ష్మయ్య పాల్గొన్నారు.